నీరున్నచోటుకే నిమ్మలంగా.. | - | Sakshi
Sakshi News home page

నీరున్నచోటుకే నిమ్మలంగా..

Aug 1 2026 12:16 AM | Updated on Aug 1 2026 12:16 AM

విమర్శలకు తావిచ్చిన మంత్రి పర్యటన

తమ సమస్యలు

వినలేదని రైతుల పెదవి విరుపు

పిఠాపురం: చుక్కనీరు లేదు.. సాగు ముందుకు కదలడం లేదంటూ పుడమిపుత్రులు దిక్కులు చూసినా, ఎవరూ పట్టించులేదు.. చివరికి ప్రతిపక్ష హోదాలో వైఎస్సార్‌ సీపీ ఆందోళన ఫలితంగా, ప్రభుత్వం దిగివచ్చింది.. గురువారం నుంచి నీటి విడుదలకు చర్యలు తీసుకుంది. అంతా అయ్యాక సారొచ్చినట్టు, నిమ్మలంగా మంత్రి నిమ్మల రామానాయుడు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించడం విమర్శలకు తావిచ్చింది. పిఠాపురం మండలంలో ఎప్పుడూ నీరుండే చోట ఆయన పరిశీలించి, అక్కడి రైతుల సమస్యలు అడగడం మరింత విస్మయానికి గురిచేసింది. అసలు సమస్య శివారు ప్రాంతాల్లో అని తెలిసినా అక్కడకు వెళ్లకుండా, సమస్య లేనిచోట పరిశీలించడం శోచనీయం. ఆ వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం హడావుడిగా పర్యటించారు. అంతకు ముందు పిఠాపురం ఆర్‌అండ్‌బీ వసతి గృహంలో ఇరిగేషన్‌, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, సాగునీటి సంఘాల ప్రతినిధులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రతి చుక్కా ఒడిసిపట్టి ఖరీఫ్‌ సాగుకు అందించాలని ఆదేశాలిచ్చారు. అనంతరం విరవాడలో ఏలేరు కాలువను మంత్రి పరిశీలించిన సందర్భంలో పలువురు రైతులు కాలువకు గేట్లు ఏర్పాటు చేయించాలని కోరారు. దీనిపై ఆయన మాట్లాడుతూ మీరు కూడా ప్రభుత్వాన్ని ఐదేళ్లయినా మారకుండా చూసుకోవాలంటూ వ్యాఖ్యానించడంతో రైతులు ముక్కున వేలేసుకున్నారు.

కన్నెత్తి చూడకుండా..

పిఠాపురం మండలం విరవాడలో నీటితో ఉన్న కాలువను మంత్రి నిమ్మల పరిశీలించారు. సాగు నీరందడం లేదని గగ్గోలు పెడుతున్న గొల్లప్రోలు మండలం చేబ్రోలు, మల్లవరం తదితర ప్రాంతాల్లో కాలువలను ఆయన కన్నెత్తి కూడా చూడలేదు. పలు మండలాల్లో ఖరీఫ్‌ నారుమళ్లు ఎండిపోతున్నాయని, శివారుకు నీరు అందించాలంటూ వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వంగా గీత సారధ్యంలో రైతుల ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చి చివరకు గురువారం నీరు వదిలింది. ఈ నేపథ్యంలో మంత్రి పర్యటించడం శోచనీయం.

ఫ ఇదిలాఉంటే మంత్రి నిమ్మల పీబీసీ ఏలేరు కాలువలో పూడికతీత వెంటనే చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలివ్వడం చూసిన రైతులు నివ్వెరబోతున్నారు. కాలువలకు నీటిని విడుదల చేశాక పూడిక ఎలా తీస్తారని, నీరు రానంత సేపూ ఏం చేశారంటూ ప్రశ్నిస్తున్నారు.

ఫ టీడీపీకి చెందిన రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పిఠాపురం పర్యటనలో టీడీపీ నేతలు దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మను మంత్రి విస్మరించడంపై ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement