సాక్షి ప్రతినిధి, కాకినాడ: అప్పుడు బొమ్మ వేశారు.. ఇప్పుడు మూసేశారు.. అన్నట్టు కూటమి రెండేళ్ల పాలన ప్రచార కరపత్రంలో పవన్ కల్యాణ్ చిత్రం లేకపోవడంతో కుంపటి రాజుకుంది. దీంతోచ ప్రస్తుతం ‘కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం అతీగతి లేకుండా సాగుతోంది. ఈ రెండేళ్ల పాలనలో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రచారానికి జనసేన, బీజేపీ శ్రేణులు దూరం కావడం ఇందుకు నిదర్శనం. దీనిని ఏకాకిలా టీడీపీ ఒక్కటే నిర్వహిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు చేపట్టిన ఈ కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది.
చిత్రం.. లేక గరంగరం
కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాల పేరుతో ప్రతి ఇంటికీ వెళ్లి అవగాహన కల్పించేందుకు, పథకాలతో కూడిన కరపత్రం రూపొందించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ తీసుకొచ్చిన కరపత్రంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ప్రధాన నేతల ఫొటోలు ఉండాలి. ఇక్కడ మాత్రం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఫొటోలు ప్రముఖంగా ప్రచురించారు. కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటో లేకపోవడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయానికి శక్తివంచన లేకుండా పాటు పడిన తమ నేత ఫొటో లేకపోవడంపై వారు మండిపడుతున్నారు. జనసేన, బీజేపీ శ్రేణులు కలిసికట్టుగా అందలం ఎక్కిస్తే.. తమనే విస్మరిస్తారా అంటూ మండిపడుతున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో సైతం లేకపోవడంతో బీజేపీ శ్రేణులు కూడా మండిపడుతున్నాయి. ఎన్నికల సమయంలో ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ’ పేరుతో నిర్వహించిన ప్రచారంలో కరపత్రాల్లో పవన్ ఫొటో ప్రముఖంగా ముద్రించారని, అధికారంలోకి వచ్చాక పక్కన పెట్టేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అదే కారణమా?
ఇటీవల జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు పట్టున్న స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల సర్దుబాట్లు ఇందులో ఉండవంటూ ఆయన కుండ బద్దలుగొట్ట డం టీడీపీలో కలవరం నింపింది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే జనసేనకు మరింత ప్రాధాన్యం తగ్గించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు విమర్శలున్నాయి.
ఇలా వచ్చి.. అలా వెళ్లి..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 22 నియోజకవర్గాలున్నాయి. ఇందులో 15 నియోజకవర్గాల్లో టీడీపీ, 6 జనసేన, ఒకచోట బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ‘కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు’ కార్యక్రమాన్ని టీడీపీ ఎమ్మెల్యేలే అడపాదడపా నిర్వహిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు దూరంగా ఉంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఓ గ్రామంలో 10 నుంచి 20 ఇళ్లను సందర్శిస్తున్నారు. ఓ గంట పాటు అటు ఇటు కలియ తిరిగి వాహనం ఎక్కి వెళ్లిపోతున్నారు. అనంతరం వార్డు, గ్రామ స్థాయి నాయకులు మిగిలిన తంతు కానిచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా ప్రజలు అనేక సమస్యలు ప్రస్తావిస్తున్నారు. ఎక్కువగా రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్లు, పక్కా ఇళ్లు, వ్యక్తిగత ప్రమాద బీమా తదితర సమస్యలు లేవనెత్తుతూండటంతో సమాధానం చెప్పలేక మెల్లగా జారుకుంటున్నారనే విమర్శలున్నాయి.
మొక్కుబడి తంతులా..
ఫ పిఠాపురం ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారు. ఆయన నియోజకవర్గానికి ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితి. టీడీపీ ఇన్‌చార్జి అయినా నిర్వహిస్తారా అంటే.. ఆ పదవి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను ఇటీవల తప్పించారు. దీంతో, జనసేన నిర్వహించక, టీడీపీ కార్యకర్తలు పట్టించుకో ఈ కార్యక్రమం అమలు ఇక్కడ అగమ్యగోచరంలా మారింది.
ఫ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్‌కు, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి బూరుగుపల్లి శేషారావుకు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. దీంతో, ఈ కార్యక్రమానికి దుర్గేష్ దూరమవగా.. శేషారావు ఒక్కరే నిర్వహిస్తున్నారు.
ఫ రెండేళ్ల పాలనపై ప్రచారానికి
జనసేన, బీజేపీ దూరం
ఫ కరపత్రంలో పవన్ ఫొటో
లేకపోవడంపై ఆగ్రహం
ఫ తూతూమంత్రంగా కానిచ్చేస్తున్న టీడీపీ


