● పార్టీలకు అతీతంగా నిర్వహణ
● మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
కిర్లంపూడి: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభను కిర్లంపూడిలోని ఆయన నివాస ఆవరణలో ఆగస్టు 1న నిర్వహిస్తామని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. పార్టీలకు, కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ మేరకు గురువారం ఆ సభ ఏర్పాట్లను మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, వైఎస్సార్ సీపీ పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట శ్రీరాంజీతో కలిసి ఆయన పరిశీలించారు. సభా వేదిక, వాహనాల పార్కింగ్, భోజనాల ఏర్పాట్లపై పలు సూచనలు, సలహాలు అందజేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చే ముద్రగడ అభిమానులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సంస్మరణ కార్యక్రమానికి ముద్రగడ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, ఆత్మీయులు హాజరు కావాలని కోరారు.


