● లంక భూముల్లో ఎంతో అనుకూలం
● విత్తనశుద్ధి, జాగ్రత్తలు తప్పనిసరి
● విత్తన కొనుగోలుకు హెక్టార్‌కు
రూ.మూడు వేల సాయం
ఆలమూరు: వర్షాకాలం ప్రారంభమైనందున లంక భూముల్లో పందిరిపై సాగు చేసే కూరగాయల సాగుకు సమయం ఆసన్నమైంది. వేడి వాతావరణాన్ని తట్టుకోవడంతో పాటు నీటిని నిలుపుకొనే లంక మట్టి నేలలు ఈ పంటల సాగుకు అనుకూలంగా ఉంటాయి. అసలు ఈ సమయంలో ఏయే పంటలు సాగు చేయవచ్చు, విత్తనాలు కొనుగోలు, తెగుళ్ల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను కొత్తపేట డివిజన్ ఉద్యాన శాఖాధికారి జి.కోటేశ్వరరావు వివరించారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకూ పందిరి కూరగాయలైన బీర, ఆనప, కాకర, పొట్ల, గుమ్మడి, బూడిద గుమ్మడితో పాటు వంగ, బెండ, టమాటా తదితర రకాలను సాగు చేసి అధిక దిగుబడులను సాధించవచ్చు. అన్ని సీజన్లలో వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకునే దొండ సాగును ఏడాది పొడవునా సాగు చేసుకునే అవకాశం ఉంది. ఆనప, బీర, పొట్ల, కాకర పంటను పందిరిపై పెంచితే మంచి నాణ్యమైన దిగుబడి వచ్చి అధిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది.
25 వేల ఎకరాల్లోనే సాగు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 3.75 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేస్తుండగా కేవలం 25 వేల ఎకరాల్లో మాత్రమే కూరగాయలు సాగు చేస్తున్నట్లు ఉద్యానశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఉద్యానశాఖ గతంలో రాయితీపై విత్తనాలను పంపిణీ చేయడగా ప్రస్తుతం ఆ పథకం నిలిచిపోయింది. విత్తనాల కొనుగోలు కోసం ఉద్యానశాఖ కేవలం హెక్టార్‌కు రూ.మూడు వేలు మాత్రమే ఆర్థికసాయం అందిస్తుంది. వంగ, క్యాబేజీ, కాలీఫ్లవర్ నారును ఉద్యానశాఖ సూచనలకు అనుగుణంగా రైతులే తయారు చేసుకుంటే పెట్టుబడి ఆదా అవుతుంది. కూరగాయలు సాగు చేసే రైతులు తమ భూమి పాస్‌బుక్, ఆధార్‌కార్డు, విత్తనాల బిల్లును ఉద్యానశాఖకు అంందజేస్తేనే ఈ రాయితీ అందుతుంది.
విత్తే ముందు జాగ్రత్తలు తప్పనిసరి
కూరగాయల సాగుకు తొలుత విత్తనశుద్ధి తప్పనిసరి. కిలో విత్తనానికి మూడు గ్రాముల ధైరమ్, ఐదు గ్రాముల ఇమిడా క్రోఫిన్ మందును ఒక దాని తరువాత మరొకటి కలిపి విత్తనశుద్ధి చేస్తే కూరగాయ మొక్కలు తెగుళ్లను తట్టుకునే శక్తి ఉంటుంది. విత్తే ముందు ఎకరానికి ఆరుటన్నుల పశువుల ఎరువు, 35 కిలోల భాస్వరం, 18 కిలోల పొటాష్ మిశ్రమాన్ని విత్తన గుంటల్లో వేయాలి. విత్తిన 25–30 రోజుల్లో లేదా పిందె దశలో సుమారు 30 కిలోల నత్రజనిని రెండు సమపాళ్లుగా చేసి మొక్కలకు అందించాలి. కూరగాయల సాగు వేయాలని నిశ్చయించుకుంటే వేసవిలోనే దుక్కి దున్ని ఉంచుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కూరగాయ తోటలకు ఈ సీజన్‌లో పెంకు పురుగు, బూడిద తెగుళ్లు సోకే అవకాశం ఉంది. నులిపురుగు కూడా పంటను దెబ్బతీసే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలి.


