ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన వ్యాన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన వ్యాన్‌

Jul 27 2026 12:18 AM | Updated on Jul 27 2026 12:18 AM

అమలాపురం రూరల్‌: ఈదరపల్లి నుంచి ముక్కామల వైపు వెళ్లే బైపాస్‌ రోడ్డులో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పాలగుమ్మి సమీపాన రోడ్డు పక్కన ఆగి ఉన్న గూడ్స్‌ వ్యాన్‌ను ఎదురుగా ఈదరపల్లి వైపు వస్తున్న వ్యాన్‌ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న నలుగురికి గాయాలు కాగా అమలాపురం ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఈ ఘటనపై ఏ విధమైన ఫిర్యాదు అందలేదని తాలూకా ఎస్సై తెలిపారు.

పల్లెవెలుగు బస్సును

ఢీ కొన్న లారీ

దేవరపల్లి: రాజమహేంద్రవరం నుంచి జంగారెడ్డిగూడెం వెళుతున్న ఆర్టీసీ పల్లెవెలుగు అల్ట్రా బస్సును దేవరపల్లి మండలం గౌరీపట్నం వద్ద మహారాష్ట్ర నుంచి చాగల్లుకు కోళ్లమేత తీసుకు వెళుతున్న లారీ ఢీ కొట్టింది. పోలీసుల కథనం ప్రకారం రాజమహేంద్రవరం–దేవరపల్లి పాత జాతీయ రహదారిలో 40 మంది ప్రయాణికులతో జంగారెడ్డిగూడెం వెళుతున్న పల్లెవెలుగు బస్సును ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో జంగారెడ్డిగూడేనికి చెందిన కుక్కల పద్మకు తీవ్రగాయాలు కాగా, మిగిలిన ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పి.మనోహర్‌ తెలిపారు. క్వారీలు, క్రషర్ల నుంచి మెటల్‌ లారీలు ఎక్కువ సంఖ్యలో తిరగడం, ఆదివారం ఉదయం వర్షం కురవడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు వాపోయారు.

వేగంగా దూసుకొచ్చి..

బైక్‌ను ఢీకొట్టి

గంగవరం: ఓ కారు వేగంగా దుకాణాల వైపు దూసుకువచ్చి.. పక్కనే బైక్‌తో ఆగి ఉన్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీకొట్టిన ఘటన గంగవరం పాతవీధిలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. దుకాణాలపైకి కారు దూసుకురావడంతో దుకాణాలకు ఉన్న గోడలు, గేట్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న చోడి చిన్నబ్బాయిదొర, రామన్నదొరలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆటోలో గోకవరం తరలించి, అక్కడ నుంచి 108లో రాజమహేంద్రవరానికి తరలించారు. రాజవరం గ్రామానికి చెందిన చోడి చిన్నబ్బాయిదొరకు తలకు, కాళ్లకు తీవ్ర గాయం కాగా, గంగవరం గ్రామానికి చెందిన మడకం రామన్నదొరకు రెండు కాళ్లకు, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నబ్బాయిదొర ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement