రాయవరం: విద్యార్థులకు కేవలం పుస్తక విజ్ఞానమే కాకుండా, ప్రయోగాత్మక పరిశోధనలపై మక్కువ పెంచేందుకు సరికొత్త వేదిక సిద్ధమైంది. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2026కు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 10–17 ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, పరిశోధనా నైపుణ్యాలను వెలికి తీసేందుకు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ వేదిక కానుంది. ఈ ఏడాది ‘సుస్థిరత కోసం సైన్‌న్స్, ఆవిష్కరణలు’ ప్రధాన ఇతివృత్తంతో పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొనవచ్చు. ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ గైడ్ టీచర్ల సాయంతో ఈనెల 31లోగా పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ ఇలా..
జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ అధికారిక పోర్టల్ ఎస్‌సీఎస్‌సీ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి. విద్యార్థి పేరు, వయసు, ఈ మెయిల్ ఐడీ, ఫొటోగ్రాఫ్‌తో పాటు ప్రాజెక్ట్ శీర్షిక అవసరం. ఈ మెయిల్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేసి వివరాలు పరిశీలించి ఓకే చేయాలి. ఈ నెల 1 నుంచి దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు ఒంటరిగా గానీ లేదా ఇద్దరు కలిసి ఒక టీమ్ గానీ ప్రాజెక్టు సిద్ధం చేయవచ్చు. విద్యార్థులు తయారు చేసిన నివేదికను తెలుగు లేదా ఇంగ్లిష్ భాషలో సమర్పించవచ్చు.
ఐదు ఉప అంశాలు
ప్రతి పాఠశాల 5 ముఖ్యమైన ఉప అంశాల నుంచి కనీసం ఒక ప్రాజెక్ట్‌నైనా తప్పనిసరిగా సమర్పించాలి.
● వ్యర్థాల నిర్వహణ కోసం ఆర్–5 సూత్రం: (రెడ్యూస్, రీయూజ్, రీట్రైవ్, రీడిజైన్, రీసైకిల్)
● ఇంధనం/శక్తి(ఎనర్జీ)కోసం ఈ–4 సూత్రం (ఎక్స్‌ప్లోర్, ఎక్స్‌పరిమెంట్, ఎన్‌హేన్స్, ఎవాల్వ్)
● జల సంరక్షణలో భాగంగా నీరు (హార్వెస్టింగ్, రీసైక్లింగ్, కన్జర్వేషన్)
● ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం, సంస్కృతి, సంప్రదాయం, ఆరోగ్యకర ఆచరణలు అనే అంశాలు ఉంటాయి.
● అప్లికేషన్ ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఫర్ సస్టైనబిలిటీ
పోటీలు ఎప్పుడంటే?
జిల్లా స్థాయిలో పోటీలు అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబరు నెలలో, జాతీయ స్థాయి పోటీలు వచ్చే ఏడాది జనవరి తర్వాత నిర్వహిస్తారు. జాతీయ స్థాయి పోటీల్లో విజేతలకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందజేస్తారు. జిల్లా నుంచి అధిక శాతం మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.


