● త్వరలో మనకూ ప్లాస్టిక్ కరెన్సీ
● 68 దేశాలకు చెందిన పాలిమర్ నోట్లు సేకరించిన కృష్ణ కామేశ్వర్
అమలాపురం టౌన్: ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లు ముద్రించి చెలామణి చేస్తున్నాయి. ఈ నోట్లు నీటిలో నానవు, చింపినా చిరగవు. అందుకే ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా పాలిమర్ నోట్ల ముద్రణ వైపు అడుగులు వేస్తున్నాయి. మన దేశం కూడా త్వరలోనే పాలిమర్ కరెన్సీ నోట్లను చెలామణిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ సంవత్సరాంతానికి తొలుత రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లను ముద్రించి చెలామణిలోకి తీసుకువస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఈ క్రమంలో అమలాపురానికి చెందిన కరెన్సీ నోట్ల సేకరణకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ ప్రపంచంలోని పలు దేశాలు ముద్రించిన పాలిమర్ నోట్లను సేకరించారు. ఆయన ఇప్పటికే 68 దేశాలకు చెందిన 144 పాలిమర్ కరెన్సీ నోట్లు సేకరించారు. మన దేశంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దాదాపు పుష్కర కాలం కిందటే పాలిమర్ నోట్లు ప్రవేశపెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆలోచన చేసిందని, అది మనకు సరిపడదని భావించి ఆ ఆలోచనను పక్కన పెట్టిందని సేకరణకర్త కృష్ణ కామేశ్వర్ తెలిపారు. ఆయన సేకరించిన తన ఖజానాలో భద్రపరుచుకున్న పలు దేశాల పాలిమర్ కరెన్సీ నోట్లను ఆయన మీడియాకు చూపారు.


