ఉత్తరాది భక్తులదక్షిణాయనం | - | Sakshi
Sakshi News home page

ఉత్తరాది భక్తులదక్షిణాయనం

Jan 2 2026 11:09 AM | Updated on Jan 2 2026 11:09 AM

ఉత్తర

ఉత్తరాది భక్తులదక్షిణాయనం

వందలాది టూరిస్టు బస్సులలో

వేలాదిగా రాక

అన్నవరంలో సందడి

బస్సుల వద్దనే బస.. నిత్యకృత్యాలు

అన్నవరం: సూర్యుడి గమనం ఉత్తర దిశగా ఉంటే ఉత్తరాయనమని.. దక్షిణ దిశగా జరుగుతూంటే దక్షిణాయనమని వ్యవహరిస్తారు. సరిగ్గా ఇదే విధంగా ఉత్తరాది భక్తులు ప్రస్తుతం దక్షిణాయనం మొదలుపెట్టారు. దక్షిణ భారతదేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ.. ఆ క్రమంలో అన్నవరం పుణ్యక్షేత్రానికి వేలాదిగా తరలి వస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాశి, అయోధ్య, ప్రయాగరాజ్‌, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌, రుషికేశ్‌, బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ వంటి పుణ్యక్షేత్రాలకు దక్షిణాది భక్తులు ముఖ్యంగా తెలుగువారు ఎక్కువ సంఖ్యలో వెళ్తూంటారు. అటువంటిది.. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాల సందర్శనకు టూరిస్టు బస్సులలో తరలి వస్తున్నారు. పది రోజులుగా వారు వస్తున్న బస్సులతో రత్నగిరి దిగువన ఉన్న కళాశాల మైదానం సందడిగా మారుతోంది.

ఫిబ్రవరి వరకూ..

ఉత్తర భారతంలోని హర్యానా, రాజస్థాన్‌, బిహార్‌, జార్ఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌తో పాటు మధ్య భారత్‌లోని ఉన్న మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాల్లో పంటల సాగు సాధారణంగా డిసెంబర్‌లో పూర్తవుతుంది. అనంతరం, అక్కడి భక్తులు అధిక సంఖ్యలో ప్రత్యేక బస్సులలో దక్షిణ భారత తీర్థయాత్రలకు బయలుదేరుతారు. ఎక్కువగా మధ్య తరగతికి చెందిన నడి వయస్కులే ఈ యాత్రలు చేస్తూండటం విశేషం. రత్నగిరికి డిసెంబర్‌లో మొదలైన ఉత్తరాది భక్తుల రాక ఫిబ్రవరి వరకూ కొనసాగుతుంది. గతంలో భక్తులు సాధారణంగా టూరిస్టు బస్సులలోనే తీర్థయాత్రలు చేసేవారు. కొన్నేళ్లుగా రైళ్లు, కార్లలో యాత్రలు చేసేవారు ఎక్కువయ్యారు. కానీ, ఉత్తరాది భక్తులు మాత్రం ఇప్పటికీ టూరిస్టు బస్సులలోనే యాత్రలు చేస్తూండటం విశేషం. వీరు సమూహాలుగా వందల వేల కిలోమీటర్లు బస్సులలోనే ప్రయాణిస్తూంటారు. కనీసం పదికి తక్కువ కాకుండా గరిష్టంగా 50 వరకూ కూడా టూరిస్టు బస్సులలో భక్తులు వచ్చిన సందర్భాలున్నాయి.

సొంతంగా వంట

వీరు వంట సామగ్రి, పొయ్యిలు, గ్యాస్‌ సిలిండర్లు తమ వెంట తెచ్చుకుంటున్నారు. బస్సులు ఆగినచోటనే వంటలు చేసుకుని, అందరూ కలసి, ఒక వరుసలో కూర్చుని భోజనాలు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా బయటి హోటళ్లలో కొనుక్కుని తినరు. ఫలహారమైనా, చపాతీలైనా, పూరీలైనా సొంతంగా తయారు చేసుకోవలసిందే. ప్రతి బస్సులో ఒక వంట మేస్త్రి, ఇద్దరు సహాయకులు ఉంటారు. వీరికి మరి కొంత మంది భక్తులు సహాయం చేస్తారు. ఎక్కువగా చపాతీలు, పూరీలు, టమాటా, బంగాళాదుంప కూర తయారు చేసుకుంటారు. దీనికి అవసరమైన గోధుమ పిండి, నూనె, బంగాళా దుంపలు, టమాటాలు, ఇతర కూరగాయలు కూడా తమ వెంట తెచ్చుకుంటారు. ఇవి అయిపోతే స్థానికంగా కొనుక్కుంటారు. దగ్గరలో సత్రాలుంటే వాటిలో హాల్స్‌ అద్దెకు తీసుకుని బస చేస్తారు. లేకపోతే బస్సుల వద్దనే విశ్రమించడం వీరికి అలవాటు. వారి వస్త్రాలు కూడా బస చేసిన ప్రదేశం వద్దనే ఉతుక్కుని ఆరబెట్టుకుంటారు.

దర్శనానికి కాలి నడకనే..

గతంలో ఉత్తరాది భక్తులు తమ బస్సులను రత్నగిరిపై నిలుపు చేసి సత్యదేవుని దర్శనానికి వెళ్లేవారు. అయితే, కొండ దిగువన కళాశాల మైదానంలో దేవస్థానం అన్ని వసతులూ కల్పించడంతో వీరు కొన్నాళ్లుగా కొండ దిగువనే తమ బస్సులు నిలిపి, సత్యదేవుని దర్శనానికి వెళ్తుతున్నారు. ఎక్కువ మంది కళాశాల మైదానంలోని బాత్‌ రూములలో స్నానాలు చేసి, ఘాట్‌ రోడ్‌ మీదుగా కాలి నడకనే ఆలయానికి చేరుకుంటున్నారు. సత్యదేవుని దర్శనానంతరం, తిరిగి తమ బస్సుల వద్దకు వస్తూంటారు.

ఉపయోగపడుతున్న షెడ్లు

టూరిస్టు బస్సులలో వచ్చే భక్తుల కోసం కళాశాల మైదానం వద్ద 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్‌ అజాద్‌ హయాంలో 5 విశ్రాంతి షెడ్లు, ఒక వంట షెడ్డు నిర్మించారు. వీటిలో అవసరమైన సౌకర్యాలను ఆ తరువాతి ఈఓ కె.రామచంద్ర మోహన్‌ హయాంలో కల్పించారు. ఇప్పుడు ఆ షెడ్లు ఉత్తరాది భక్తులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

ఆ మెట్ల దారి ప్రారంభిస్తే వీరికి మేలు

ప్రస్తుతం ఉన్న మెట్ల దారిని తొలి పావంచా నుంచి రత్నగిరిపై ఆలయం వరకూ గతంలో నిర్మించారు. కళాశాల మైదానం నుంచి ఆ మెట్ల దారికి చేరుకోవాలంటే సుమారు కిలోమీటరు దూరం నడవాల్సి వ స్తోంది. ఈ నేపథ్యంలో కళాశాల మైదానంలోని మొద టి ఘాట్‌ రోడ్డు నుంచి రత్నగిరి పైకి కొత్త మెట్ల మా ర్గం నిర్మించారు. దీని ప్రారంభంలో ఆర్చి, మెట్లకు ఇ రువైపులా పిట్ట గోడ నిర్మాణానికి త్వరలో టెండర్లు పి లవనున్నారు. ఆ పనులు పూర్తయి, నూతన మెట్ల మా ర్గం ప్రారంభమైతే ఉత్తరాది భక్తులతో పాటు దేవస్థా నం కళాశాల మైదానంలో వాహనాలను నిలుపు చేసి, కాలి నడకన వచ్చే భక్తులకు ఎంతో మేలు జరుగుతుంది.

టూరిస్టు బస్సులలో వచ్చే భక్తుల కోసం దేవస్థానం నిర్మించిన షెడ్లు

కళాశాల మైదానంలో ఉత్తరాది భక్తుల టూరిస్టు బస్సులు

ఉత్తరాది భక్తులదక్షిణాయనం1
1/4

ఉత్తరాది భక్తులదక్షిణాయనం

ఉత్తరాది భక్తులదక్షిణాయనం2
2/4

ఉత్తరాది భక్తులదక్షిణాయనం

ఉత్తరాది భక్తులదక్షిణాయనం3
3/4

ఉత్తరాది భక్తులదక్షిణాయనం

ఉత్తరాది భక్తులదక్షిణాయనం4
4/4

ఉత్తరాది భక్తులదక్షిణాయనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement