ఆధ్యాత్మిక జ్ఞానశక్తితో ఆశయ సాధన
పిఠాపురం: జీవితాశయ సాధనకు మానసిక శక్తి, మనోధైర్యం, సంకల్పంతో కూడిన ఆధ్యాత్మిక, తాత్త్విక జ్ఞానశక్తి అవసరమని విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ ఆలీషా అన్నారు. నూతన ఆంగ్ల సంవత్సర ఆరంభం సందర్భంగా పీఠంలో గురువారం నిర్వహించిన జ్ఞాన మహాసభలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. మనసును స్థిరపరచుకునే తత్వమే ఆధ్యాత్మిక తత్వమని, దీని ద్వారా జీవితంలో చిన్న చిన్న వివాదాలు తొలగించుకుని, నిరంతరం సుఖసంతోషాలతో జీవించడానికి, మంచి చెడుల విశ్లేషణతో కూడిన మానసిక స్థితిని ఏర్పరచుకోవాలని అన్నారు. మనలోని లోపాలను సవరించుకోకుండా ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదన్నారు. ఆ లోపాలను తొలగించుకునే విధానమే ఆధ్యాత్మిక తత్త్వమన్నారు. మానవత్వాన్ని బోధించేదే మతమని, మానవత్వాన్ని హరించేది మతం కాదని, రాక్షసత్వమని అభివర్ణించారు. మనసును తాత్త్విక జ్ఞానశక్తితో నింపుకోవడానికి సద్గురు మార్గంలో త్రయీ సాధన ఆచరించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి, గురు దక్షిణగా ప్రకృతిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అమెరికాకు చెందిన కిరణ్ ప్రభ మాట్లాడుతూ, పీఠం నిర్వహిస్తున్న బాలవికాస్ కార్యక్రమాలను కొనియాడారు. డాక్టర్ కొండా నరసింహారావు, అలివేలు మంగాదేవి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో తాత్త్విక బాల వికాస్ చిన్నారుల ప్రసంగాలు అందరినీ అలరించాయి. ఉమా ముకుంద నేతృత్వంలో సంగీత విభావరి రంజింపజేసింది. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ద్వారా ఉమర్ ఆలీషా మహిళా యువతకు వస్త్రాలు, దంగేటి రామకృష్ణ సహకారంతో పీఠాధిపతి చేతుల మీదుగా ధాన్యపు కుచ్చులు పంపిణీ చేశారు.
ఆధ్యాత్మిక జ్ఞానశక్తితో ఆశయ సాధన


