రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా రత్నగిరికి గురువారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సత్యదేవుని ఆలయానికి భక్తుల రాక కొనసాగింది. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. సత్యదేవుని వ్రతాలు 1,800 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 గంటలకు చండీహోమం నిర్వహించనున్నారు. రూ.750 టికెట్టుతో భక్తులు ఈ హోమంలో పాల్గొనవచ్చు.
ఉత్సాహంగా
సైన్స్ రంగోలీ పోటీలు
పెద్దాపురం (సామర్లకోట): నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకొని పట్టణ చిల్ట్రన్స్ క్లబ్ ఆధ్వర్యాన పెద్దాపురం యాసలపు సూర్యారావు భవనంలో విద్యార్థులకు గురువారం జిల్లా స్థాయి సైన్స్ ముగ్గుల పోటీలు నిర్వహించారు. జూనియర్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ విభాగాల్లో 300 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని క్లబ్ గౌరవాధ్యక్షుడు బుద్దా శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు కూనిరెడ్డి అరుణ, ప్రతినిధులు అనూష, అంజలి, జస్విత, సాయి బంగారం, నేహా, రేణుకా, పవన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
రాచపల్లిలో స్క్రబ్ టైఫస్ కేసు
ప్రత్తిపాడు రూరల్: మండలంలోని రాచపల్లిలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదైంది. స్థానిక నంది సెంటర్‌కు చెందిన 64 ఏళ్ల నాగభూషణం అనే మహిళకు ఈ వ్యాధి సోకినట్లు గుర్తించామని రాచపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ గీతా సుధ గురువారం తెలిపారు. బాధిత మహిళను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
జిల్లా వ్యవసాయ
అధికారిగా రాబర్ట్ పాల్
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా వ్యవసాయ అధికారిగా కె.రాబర్ట్ పాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఈ స్థానంలో ఉన్న మాధవరావు బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. పాల్ ఉమ్మడి జిల్లా ఆత్మ ప్రాజెక్ట్ మేనేజర్‌గా వ్యవహరిస్తూ, ఇన్‌చార్జి జిల్లా వ్యవసాయ అధికారిగా నియమితులయ్యారు. ఆయనకు రాజమహేంద్రవరం ఏడీఏ సూర్యరమేష్, ఏఈఓ సంఘం అధ్యక్షుడు వేణుమాధవ్, పలువురు వ్యవసాయ అధికారులు అభినందనలు తెలిపారు.
రత్నగిరికి పోటెత్తిన భక్తులు


