ఎలా చేస్కోవాలి పండగ?
● జిల్లాలో 5.60 లక్షల రేషన్ కార్డులు
● అమలాపురం పట్టణానికే
గోధుమపిండి పరిమితం
● 11,634 కార్డుదారులకు మాత్రమే..
● చంద్రబాబు ప్రభుత్వ వచ్చిన
తర్వాత నిలిచిన కందిపప్పు పంపిణీ
● ఆగిపోయిన
ఇంటింటికీ రేషన్ సరఫరా
ప్రతి ఒక్కరికీ గోధుమపిండి అందించాలి
పేద, మధ్య తరగతికి మేలు చేసే ప్రతి నిత్యావసర వస్తువును ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందరికీ అందించాలి. కేరళ ప్రభుత్వం 16 రకాల నిత్యావసర వస్తువులను అందిస్తోంది. గోధుమ పిండి ప్రతి లబ్ధిదారునికి అందించాలి. మేలైన బియ్యంతోపాటు కందిపప్పు ఇతర వస్తువులు అందించేందుకు చర్యలు తీసుకోవాలి.
– కారెం వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
రేషన్ దుకాణాల్లో
కందిపప్పు కనుమరుగు
సాక్షి, అమలాపురం: పావలా పనికి.. ముప్పావలా ప్రచారం అనే నానుడికి చంద్రబాబు ప్రభుత్వ పాలన నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి. పండగ సమయంలో చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు, మధ్య తరగతి వర్గాలకు మేలు చేసేందుకు చెక్కి గోధుమ పిండి పంపిణీ చేస్తామని ప్రభుత్వ పక్షం రోజులుగా ఊదరగొడుతోంది. దీనిపై అధికారుల సమీక్షలు సాగిస్తుండగా, సొంత మీడియా, సామాజిక మాధ్యమాలలో ప్రచారం హోరెత్తిస్తోంది. ఇంతా చేసి కేవలం జిల్లా ప్రధాన కేంద్రం ఉన్న నగరాలకు, పట్టణాలకు మాత్రమే గోధుమపిండి పంపిణీ అని ఇప్పుడు చల్లగా చెబుతోంది.
ప్రచారానికే పరిమితం
సంక్రాంతి పండగనాడు పేదలకు చెక్కి గోధుమ పిండి ఇస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుపై కేజీ చొప్పున గోధుమ పిండి ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. కేజీ రూ.20 చొప్పున ఇస్తామని ప్రకటించింది. బహిరంగ మార్కెట్‌లో కేజీ క్వాలిటీ గోధుమ పిండి రూ.60 నుంచి రూ.65 వరకు పలుకుతోంది. సంక్రాంతి నాడు పేదలకు మేలు చేసేందుకు ఇలా పంపిణీ చేస్తున్నామని చెప్పుకొచ్చింది.
దీనిపై పక్షం రోజులుగా ప్రచారం హోరెత్తిస్తోంది. తీరా అమలు చేయాల్సిన సమయానికి వచ్చేసరికి జిల్లా కేంద్రమైన అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోనే ఇస్తామని చెప్పడం గమనార్హం. మున్సిపాలిటీ పరిధిలో కేవలం 11,634 కార్డు దారులకు మాత్రమే పరిమితం చేశారు. దీనికి కూడా శుక్రవారం పట్టణ పరిధిలో ఉన్న 19 రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి ప్రకటించారు. అయితే అమలాపురం పట్టణంలో గురువారం నుంచి పంపిణీ మొదలయ్యింది.
మండిపడుతున్న వినియోగదారులు
చెక్కి గోధుమపిండి కేవలం అమలాపురం పట్టణవాసులకు మాత్రమే పరిమితం అని తెలిసి జిల్లాలోని రేషన్ కార్డుదారులు కంగుతిన్నారు. జిల్లాలో మండపేట నియోజకవర్గంతో కలిపి సుమారు 5.60 లక్షల రేషన్ కార్డుదారులు ఉన్నారు. అంటే మొత్తం లబ్ధిదారులలో కేవలం 2 శాతం మందికి మాత్రమే గోధుమ పిండి అందుతుందని అంచనా. జిల్లాలో మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీతోపాటు 23 మండలాల్లో ఈ గోధుమ పిండి పంపిణీ లేదు. దీనిపై వినియోగదారులు మండిపడుతున్నారు. పండగ అమలాపురం పట్టణవాసులకేనా అని ప్రశ్నిస్తున్నారు.
బాబు ప్రభుత్వంలో
రేషన్ వ్యవస్థ చిన్నాభిన్నం
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజా పంపిణీ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాణ్యమైన బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్) అందించేవారు. అరకేజీ పంచదార, కేజీ చొప్పున కందిపప్పు, గోధుమ పిండిని వినియోగదారులకు అందజేసేవారు. రేషన్‌ను ఇంటింటికీ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్(ఎండీయూ)ల ద్వారా పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత నెమ్మది నెమ్మదిగా ఈ వ్యవస్థను తొలగించారు. ఇప్పుడు వృద్ధులు, వితంతువులు కూడా రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఎండీయూలను తొలగించడంతో సుమారు 250 మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వీరు రోడ్డు ఎక్కి ఆందోళన చేసినా బాబు ప్రభుత్వం కనికరం చూపలేదు. పలు సందర్భాలలో రేషన్ ద్వారా ముతక బియ్యం ఇస్తుండడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే కందిపప్పును నిలిపివేశారు. కేవలం గత ఏడాది జనవరి కందిపప్పు రూ.67 చొప్పున అందించారు. ఇప్పుడు ఇది నిలిపివేయగా బహిరంగ మార్కెట్‌లో కేజీ కందిపప్పును రూ.120 నుంచి రూ.135 చేసి కొనుగోలు చేయాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో గోధుమపిండి ప్రతి లబ్ధిదారునికి అందించగా, బాబు ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా దీనిని అమలాపురం పట్టణ పరిధిలో కేజీ రూ.20 చేసి అందించాలని నిర్ణయించారు.
ఎలా చేస్కోవాలి పండగ?
ఎలా చేస్కోవాలి పండగ?


