
క్రమంగా పెరుగుతూ..
● మళ్లీ గోదావరికి వరద నీరు
● నీట మునిగిన కనకాయలంక కాజ్‌వే
ఐ.పోలవరం/ పి.గన్నవరం: వరద మళ్లీ పెరుగుతోంది.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి పరవళ్లు తొక్కుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వరద నీరు పెద్ద ఎత్తున దిగువకు వస్తోంది.
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శుక్రవారం ఉదయం పెరిగిన వరద తరువాత సాయంత్రం నుంచి తగ్గుముఖం పట్టింది. తిరిగి శనివారం ఉదయం నుంచి పెరుగుతూ వస్తోంది. తెల్లవారు జామున మూడు గంటల నుంచి వరద క్రమేపీ పెరుగుతోంది. మూడు గంటలకు బ్యారేజీ నుంచి దిగువకు 7,52,579 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇది ఉదయం ఆరు గంటల సమయానికి 7,93,608 క్యూసెక్కులకు, మధ్యాహ్నం 12 గంటలకు 8,60,262 క్యూసెక్కులకు, మూడు గంటలకు 8,98,113 క్యూసెక్కులకు, రాత్రి ఎనిమిది గంటలకు 9,75,286 క్యూసెక్కులకు చేరింది.
పడవలపైనే ప్రయాణం
జిల్లాలోని లంక గ్రామాలపై వరద ప్రభావం పడింది. పి.గన్నవరం మండల పరిధిలో జి.పెదపూడిలంక, ఊడిమూడిలంక, బూరుగులంక, అరిగెలవారిపేటలకు ఇప్పటికీ పడవలపై రాకపోకలు సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా వరద పెరగడంతో మండలాన్ని ఆనుకుని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కనకాయలంక కాజ్‌వే నీట మునిగింది. దీంతో ఇక్కడ పడవలపై రాకపోకలు సాగించాల్సి వస్తోంది. అలాగే పెదమల్లంక, సిర్రావారిలంక, ఆనగారిలంకలకు సైతం పడవలపై వెళ్తున్నారు. మరోసారి వరద పెరగడంతో ఇక్కడ లంక రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులకు ఇక్కట్లు మొదలయ్యాయి.
లోతట్టు ప్రాంతాలను తాకుతూ..
ఐ.పోలవరం మండలం అన్నంపల్లి అక్విడెక్ట్‌ను ఆనుకుని వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ మండలంలో మురమళ్ల, కేశనకుర్రు పంచాయతీ పరిధిలోని పొగాకులంక, పల్లిపాలెం, ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠాణేల్లంక, గురజాపులంక, కూనాలంక, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు రేవు, బలుసుతిప్ప, అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెం వంటి లోతట్టు ప్రాంతాలను తాకుతూ వరద ప్రవహిస్తోంది. వరద మరింత పెరిగితే ఈ లంక గ్రామాల్లోకి వరద నీరు చేరే అవకాశముంది.
ప్రయాణం.. ప్రమాదం
వరద ఉధృతి పెరుగుతున్న సమయంలో జిల్లాలోని పలు రేవుల వద్ద లైఫ్ జాకెట్లు లేకుండా పడవలపై ప్రయాణాలు సాగిస్తుండడం గమనార్హం. ఐ.పోలవరం మండలం జి.మూలపొలం రేవులో ఎటువంటి జాగ్రత్తలు పాటించడం లేదు. కనీసం లైఫ్ జాకెట్లు కూడా ఉపయోగించకుండా ప్రయాణికులను రేవు దాటిస్తున్నారు. వరదల సమయంలో రేవు ప్రయాణాలపై అధికారులు నిఘా పెట్టాల్సి ఉన్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. ప్రమాదం జరిగితేకాని అధికారులు స్పందించరా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.

క్రమంగా పెరుగుతూ..

క్రమంగా పెరుగుతూ..