
తిరుచ్చి వాహనంపై ఊరేగింపు
అన్నవరం: రత్నగిరిపై ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని శనివారం తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు ఉత్సవమూర్తులను తిరుచ్చి వాహనంపై ప్రతిష్టించి పూజల అనంతరం అర్చకులు ఊరేగింపు ప్రారంభించారు. వేదపండితుల మంత్రాల నడుమ మంగళవాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా మూడు సార్లు ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు. తిరిగి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయానికి చేర్చారు. ఆలయ అర్చకుడు కంచిభట్ల రామ్‌కుమార్, వేదపండితులు వేదుల సూర్యనారాయణ, చిట్టి శివ, ముష్టి పురుషోత్తం, సంతోష్ పాల్గొన్నారు.
స్వామిని దర్శించిన 25 వేల మంది భక్తులు
శనివారం సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు 1,200 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది భక్తులకు అన్నదాన పథకంలో భోజనం పెట్టారు.
నేడు టేకు రథంపై ఊరేగింపు
సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను టేకు రథంపై ఆదివారం ఉదయం పది గంటలకు ఆలయప్రాకారంలో ఊరేగించనున్నారు. రూ.2,500 టిక్కెట్‌తో ఈ సేవలో పాల్గొనే నలుగురు భక్తులకు అంతరాలయ దర్శనం, వేదాశీర్వచనం, స్వామివారి కండువా, జాకెట్టుముక్క, ప్రసాదం అందజేస్తారు.
సత్యదేవుని దర్శనానికి క్యూలో నిల్చున్న భక్తులు