
నేటి నుంచి ఎలుకల మందు ఉచిత పంపిణీ
కరప: జిల్లావ్యాప్తంగా సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా రైతు సేవా కేంద్రాల్లో బుధవారం నుంచి బ్రోమోడయోలిన్ మందు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు జేడీఏ విజయ్‌కుమార్ వెల్లడించారు. వాకాడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని రైతులందరూ ఒకేసారి పొలాల్లో ఈ మందును వాడాలని రైతులకు సూచించారు. రైతులకు టార్పాలిన్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, వారు ఆర్‌ఎస్‌కేల్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం యూరియా కొరత ఎక్కడా లేదన్నారు. అవసరం మేరకే రైతులు యూరియాను తీసుకెళ్లాలన్నారు. యూరియా స్థానే నానో యూరియా లిక్విడ్ కూడా అందుబాటులో ఉందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రాయితీపై వాహనాలు, యంత్రాలు ఇస్తున్నట్టు చెప్పారు. డ్రోన్లు 80 శాతం సబ్సిడీపై ఇస్తున్నామన్నారు. సకాలంలో తొలకరి నాట్లు వేసి, రబీ తర్వాత మూడో పంటగా అపరాలు వేసేందుకు రైతులు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జేడీఏ సామూహిక ఎలుకల నివారణ కరపత్రాలను విడుదల చేశారు.
సామాజిక భద్రత, న్యాయమే లక్ష్యం
సామర్లకోట: సుస్థిర లక్ష్యాల సాధనలో భాగంగా ప్రతి గ్రామంలోను సామాజిక భద్రత, సామాజిక న్యాయం కలిగేలా చర్యలు తీసుకోవాలని విస్తరణ శిక్షణా కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ అన్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు 11 జిల్లాల్లోని ఉత్సాహవంతులైన పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేసి టీఓటీలుగా ఇచ్చే శిక్షణను మంగళవారం స్థానిక ఈటీసీలో ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణకు 130 మందిని రెండు బ్యాచ్‌లుగా విభజించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ, గ్రామంలోని పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి, వారి ఆర్థిక, ఆరోగ్య సంబంధ జీవన విధానాన్ని గుర్తించి, వారి అవసరాలు తీర్చేలా చేయాలన్నారు. వృద్ధాప్య, దివ్యాంగత్వం, నిరుద్యోగం, వ్యాధి, ప్రమాదం, మరణం వంటి సందర్భాల్లో వ్యక్తి, ఆ కుటుంబాలకు సామాజిక న్యాయం చేయడానికి పంచాయతీ పరిధిలోనే కృషి జరగాలన్నారు. కోర్సు డైరెక్టర్లుగా కె.సుశీల, ఎస్‌ఎస్ శర్మ వ్యవహరించారు. ఫ్యాకల్టీలు రామకృష్ణ, శ్రీనివాసరావు, ఎం చక్రపాణిరావు, కేఆర్ నిహారిక శిక్షణ ఇచ్చారు.
ఐసీటీసీలో సేవలు మెరుగుపర్చాలి
కేంద్ర బృందం తనిఖీ
పెద్దాపురం: పట్టణంలోని ఏరియా ఆస్పత్రి ఐసీటీసీ విభాగంలో మంగళవారం కేంద్ర బృందం ఆకస్మిక తనిఖీ చేసింది. న్యూఢిల్లీలోని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ డీడీ యూబీ దాస్, నాకో కన్సల్టెంట్లు రాహుల్ ఆహూజా, డాక్టర్ జస్వందర్ సింగ్, ఏపీ స్టేట్ సొసైటీకి చెందిన డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ ఈ బృందంలో ఉన్నారు. ఐసీటీసీ సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ఐసీటీసీలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఐసీటీసీ భాగస్వామి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఐసీటీసీ, సంపూర్ణ సురక్ష కేంద్రానికి వచ్చిన వారి వివరాలను సోచ్ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఐసీటీసీలోని రికార్డులను పరిశీలించి, ఇక్కడి సేవలపై కౌన్సెలర్ బి.శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. బృందం వెంట అదనపు పీడీ డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ ఉమామహేశ్వరి తదితరులు ఉన్నారు.

నేటి నుంచి ఎలుకల మందు ఉచిత పంపిణీ

నేటి నుంచి ఎలుకల మందు ఉచిత పంపిణీ