
మహానేతకు నీరాజనం
● మరుపురాని మహా మనిషి రాజన్న
● జన హృదయ నేతకు ఘన నివాళి
● జిల్లావ్యాప్తంగా
పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు
● వైఎస్సార్ సీపీ శ్రేణుల శ్రద్ధాంజలి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాట తప్పని, మడమ తిప్పని నేతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని.. దివికేగిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలను జిల్లా గుర్తుకు తెచ్చుకుంది. రాజన్న అసువులు బాసి 16 ఏళ్లయిన సందర్భంగా వైఎస్ అభిమానులు జిల్లా అంతటా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం జిల్లాలో పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అనేక కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టారు. వైఎస్సార్ సీపీ నేతలతో పాటు, పార్టీరహితంగా వైఎస్ అభిమానులు సైతం వర్ధంతిని పురస్కరించుకుని అనాథలు, రోగులు, నిరుపేదలకు తమకు తోచిన రీతిలో సాయం అందించారు. వాడవాడలా ఉన్న రాజన్న విగ్రహాలను స్థానికులు, వైఎస్సార్ సీపీ నేతలు రంగులతో అలంకరించి, పూలమాలలతో ముంచెత్తారు. దివంగత మహానేత వైఎస్సార్ జిల్లాకు చేసిన మేలును గుర్తు చేసుకుని ఘనమైన నివాళులర్పించారు.
● జగ్గంపేటలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతిని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఆయనతో పాటు, పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోట రాంజీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జగ్గంపేట క్యాంప్ కార్యాలయం, బస్టాండ్ వద్ద వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు. క్యాంప్ కార్యాలయం నుంచి పార్టీ నేత బండారు రాజా ఆధ్వర్యంలో జరిగిన భారీ మోటార్ సైకిల్ ర్యాలీలో చంటిబాబు పాల్గొన్నారు.
● పార్టీ పిఠాపురం కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పార్టీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్, మాజీ ఎంపీ వంగా గీత పూలమాలలు వేసి నివాళులర్పించారు. పిఠాపురం పట్టణం, రూరల్, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లో వైఎస్సార్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. గొల్లప్రోలులో అన్న సమారాధనలో పాల్గొన్నారు.
● సామర్లకోట జగనన్న కాలనీలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పెద్దాపురం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ దవులూరి దొరబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. పట్టణంలో రాజీవ్ గృహకల్ప, ప్రసన్నాంజనేయస్వామి ఆలయం వద్ద వైఎస్సార్ విగ్రహాలకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఇంకా పెద్దాపురం మున్సిపల్ సెంటర్, సినిమా సెంటర్, కాండ్రకోట, సిరివాడ, ఉలిమేశ్వరంల్లో వైఎస్సార్ విగ్రహాలకు ఆయన నివాళులర్పించారు. అలాగే గుడివాడ, కట్టమూరు, ఆర్‌బీ కొత్తూరు గ్రామాల్లో వైఎస్సార్ చిత్రపటాలకు పార్టీ నేతలు, వైఎస్ అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
● ప్రత్తిపాడు నియోజకవర్గంలో వాడవాడలా పార్టీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు నాయకత్వంలో వైఎస్సార్‌కు పార్టీ శ్రేణులు ఘనమైన నివాళులర్పించారు. నియోజకవర్గంలోని ఏలేశ్వరం, సి.రాయవరం గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలకు గిరిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మెట్ట ప్రాంత రైతులకు మహానేత చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రత్తిపాడు కేంద్రంతో పాటు, ప్రత్తిపాడు రూరల్, రౌతులపూడి, శంఖవరం, ఏలేశ్వరం నగర పంచాయతీ, ఏలేశ్వరం మండలంలోని గ్రామాల్లో వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. కాగా, పార్టీ నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
● తుని నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నాయకుడు యనమల కృష్ణుడు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తుని శ్రీరామ సెంటర్‌లో మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోటనందూరు మండలం బిల్లనందూరులో ఎంపీపీ లగుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. తుని పట్టణంతో పాటు, రూరల్, తొండంగి, కోటనందూరు మండలాల్లో వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
● కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో మహానేత వైఎస్సార్ విగ్రహానికి స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాకలపూడిలో వైఎస్సార్ విగ్రహానికి పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కరీంబాషా తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జిల్లా కేంద్రం కాకినాడ బాలాజీచెరువు సెంటర్‌లో వైఎస్ నిలువెత్తు కాంస్య విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లాకు వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరుపేదలు, మధ్య తరగతి వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాల్లో రోల్ మోడల్‌గా జనరంజక పాలన అందించారని ప్రస్తుతించారు. ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతూ, ఎన్నికల వరకే రాజకీయాలను పరిమితం చేసి, అభివృద్ధికి రాజకీయాలు చొప్పించకుండా, విలువలతో కూడిన పాలన అందించారన్నారు. పార్టీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, బీసీ, యువజన విభాగాల జిల్లా అధ్యక్షులు అల్లి రాజబాబు, రాగిరెడ్డి అరుణ్‌కుమార్(బన్నీ) తదితరులు పాల్గొన్నారు.