
నన్నయ వర్సిటీ నిర్ణయం సరికాదు
● ఎంపీ పొలిటికల్ సైన్స్ గ్రూపు
కొనసాగించాలి
● విద్యార్థి, యువజన, దళిత, ప్రజా
సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్‌లో ఎంఏ పొలిటికల్ సైన్స్ గ్రూపును యథావిధిగా కొనసాగించాలని, లేకుంటే ఉద్యమిస్తామని నేతలు స్పష్టం చేశారు. విద్యార్థి, యువజన, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎన్.రాజా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, ఏఎస్‌ఎఫ్, కేవీపీఎస్, దళిళ సంఘాలు, ఎస్సీ,ఎస్టీ సంఘాలు, ఎస్‌ఎస్‌యూఐ, రెల్లి సంఘం, జనచైతన్య వేదిక వంటి పలు సంఘాలు పాల్గొని చర్చ నిర్వహించాయి. నాయకులు మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో రాజమహేంద్రవరం క్యాంపస్‌లో పొలిటికల్ సైన్స్ విభాగంలో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలు నిలిపివేస్తూ యూనివర్సిటీ యాజమాన్యం తీసుకుని నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి కొత్త గ్రూపులను ఏర్పాటు చేయాల్సిన యాజమాన్యం ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం స్పందించాలని, లేనిపక్షంలో దశలవారీ ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిరణ్, ఏఐఎస్‌ఎఫ్ కోనసీమ జిల్లా కార్యదర్శి జి.రవికుమార్, ఏఎస్‌ఎఫ్ నాయకులు తాడేపల్లి విజయ్‌కుమార్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, దళిత సంఘం నాయకులు కోరుకొండ చిరంజీవి, ఎస్సీ,ఎస్టీ సంఘాల నాయకులు పి.వేణుగోపాల్, జే.సుబ్బారావు, ఎస్.విజయ్‌కుమార్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు తారకేష్ , రెల్లి సంఘం నాయకులు నీలం వెంకటేశ్వరరావు, దళిత ప్రజా సంఘం నాయకులు నక్క వెంకటరత్నం, మాజీ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు టి. అరుణ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పూర్ణిమ రాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు వై.భాస్కర్ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కె.లహరి, కే.జ్యోతి, టి.సౌమ్య పాల్గొన్నారు.