
ఉచిత బస్సుతో ఆటోరడైవర్ల ఉపాధికి గండి
● నేటి నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసనలు
● కార్యాచరణ ప్రకటించిన
కోనసీమ జిల్లా అధ్యక్షుడు సత్తిరాజు
అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టి, ఆటో డ్రైవర్ల ఉపాధికి గండి కొట్టిందని ఆంధ్ర ఆటోవాలా కోనసీమ జిల్లా శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం నుంచి ఆటో డ్రైవర్లు నల్ల బ్యాఢ్జీలు ధరించి, ఆటోలకు నల్ల జెండాలు తగిలించి నిరనస తెలిపాలని ఆయన పిలుపునిచ్చారు.
అమలాపురం హైస్కూల్ సెంటర్‌లో మంగళవారం డివిజన్ ఆటో డ్రైవర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సత్తిరాజు నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ ప్రకటించారు. దీనిపై సమావేశం ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది. త్వరలోనే 48 గంటల పాటు ఆటోలు నిలిపివేసి నిరాహార దీక్షలు చేపడతామని ఆయన వెల్లడించారు. రామచంద్రపురం డివిజన్ ఆటో డ్రైవర్లతో బుధవారం నిర్వహించే సమావేశంలో ఆ తేదీ ప్రకటిస్తామని చెప్పారు. జిల్లాలో 25 శాతం ఆటోలు విద్యాసంస్థలకు విద్యార్థులను తరలిస్తున్న క్రమంలో ఆ ఆటోల డ్రైవర్లు 48 గంటల నిరాహార దీక్షకు రెండు రోజుల ముందు ఆయా విద్యా సంస్థలకు నోటీసులు ఇవ్వాలని సమావేశం సూచించింది. తక్షణమే కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆటోవాలా జిల్లా శాఖ కార్యదర్శి ఊటాల వెంకటేష్ నిరసన తీర్మానాలు సమావేశంలో ప్రవేశపెట్టారు. ఆటో యూనియన్ల ప్రతినిధులు మోకా శ్రీను, వాసంశెట్టి శ్రీను, డివిజన్ అధ్యక్షుడు బొలిశెట్టి శంకర్, ప్రధాన కార్యదర్శి బొక్కా నాని, కోశాధికారి బొమ్మి ఫణి, రాయుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.