
600 కిలోల గంజాయి స్వాధీనం
మలకపల్లి వద్ద కారులో పట్టివేత
తాళ్లపూడి: మండలంలోని మలకపల్లి వద్ద భారీగా గంజాయి పట్టు బడింది. వైజాగ్ జోనల్ యూనిట్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు తమిళనాడు రిజిస్ట్రేషన్‌కు చెందిన ఇన్నోవా కారులో సుమారు 600 కేజీల గంజాయి వస్తున్నట్టు అందిన సమాచారం మేరకు వైజాగ్ నుంచి వెంబడిస్తూ మలకపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న ముగ్గురిలో ఇద్దరు పరారు కాగా, పట్టుబడ్డ మహారాజన్ రాజా అనే వ్యక్తిని తాళ్లపూడి స్టేషన్‌కు తరలించారు. సరకును, వాహనాన్ని, నిందితుడిని రాజమహేంద్రవరం తరలిస్తామని అక్కడి అధికారులు పూర్తి సమాచారం ఇస్తారని తెలిపారు.
ఐరెన్ ట్రాక్టర్ బోల్తా:
వ్యక్తి మృతి
ముమ్మిడివరం: ఇనుప ఊసలతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రక్కు అదుపు తప్పి బొల్తా పడడంతో వాహనంపై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. ముమ్మిడివరం మండలం అయినాపురం అవుట్ ఫాల్ స్లూయిస్ ఏటుగట్టుపై గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. అయినాపురం ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఐరన్‌ను ట్రాక్టర్‌పై మురమళ్ల తరలిస్తుండగా ఏటిగట్టుపై ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌పై ఉన్న యానాం శివారు కురసాం పేటకు చెందిన కూలీ మేడిశెట్టి గోవిందు (48) ఊసలు మధ్య ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు ముమ్మిడివరం ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.