
గురువు.. తిమిరంలో తేజోమూర్తి
● బాలలను బాధ్యత గల
పౌరులుగా తీర్చిదిద్దే నేర్పరి
● రేపు ఉపాధ్యాయ దినోత్సవం
రాయవరం: ‘గురవంటే రెండు బెత్తం దెబ్బలు.. నాలుగు గుంజీలు తీయించడం కాదు.. కొండంత చీకటిలో తేజోమయంగా వెలిగే దీపం. గురవంటే పసిపిల్ల పెదాలపై విరిసిన నవ్వురేఖ..’ ఈ మాటలన్నది ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. అజ్ఞానపు తిమిరాన్ని పారదోలి విజ్ఞాన కాంతులు ప్రసరింపజేసే మార్గదర్శకులు గురువులు. విద్యార్థిని సానబట్టి వజ్రంలా తయారు చేసే అక్షర శిల్పులు. అందుకే ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కొఠారి దేశ భవిష్యత్ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందన్నారు. ఎంతటి శాస్త్రవేత్త అయినా, దేశానికి ప్రధాని అయినా ఒక ఉపాధ్యాయుడి వద్ద ఓనమాలు నేర్చుకున్న వారే. గురువుల స్ఫూర్తితో ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. శుక్రవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న వేళ గురువులపై పలువురి అభిప్రాయాలతో కథనం..
గురువు పాత్ర ఎనలేనది
సమాజంలో గురువు పాత్ర ఎనలేనిది. నిరంతర విద్యార్థిగా ఉంటూ తన శిష్యులను ఉన్నత స్థానంలో నిలపడానికి ప్రయత్నిస్తుంటారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివే సమయంలో వయోల మేడమ్ సైన్స్, ఇంగ్లిష్ బోధించేవారు. ఆమె బోధనా విధానం నన్ను ప్రభావితం చేసింది. ఉపాధ్యాయులు నేర్పిన విద్యతోనే ఈ రోజు జిల్లా అధికారిగా రాణించగలుగుతున్నాను.
– జి.మమ్మీ, డిప్యూటీ కలెక్టర్,
ఏపీసీ, సమగ్ర శిక్షా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

గురువు.. తిమిరంలో తేజోమూర్తి