
ఊరేగింపులో ముగ్గురిపై కత్తిపోట్లు
వినాయక నిమజ్జనం సందర్భంగా ఘటన
అల్లవరం: గణేష్ ఉరేగింపులో జరిగిన ఘర్షణలో ముగ్గురు కత్తిపోట్లకు గురైన ఘటన మండలం కొమరగిరిపట్నంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, వివరాలు ప్రకారం వినాయకచవితి సందర్భంగా గుర్రం వారి వీధిలో వినాయక విగ్రహాన్ని గురువారం ఊరేగించారు. విగ్రహం శివాలయం వద్దకు వచ్చే సరికి వారిలో వారికి ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో తిక్కిరెడ్డి మోహిత్ మణికంఠ చెడీ తాళింఖానా చేసే కత్తితో సుంకర సురేష్, కొమ్మూరి శంకర్‌లను వెనుక నుంచి పొడిచాడు. మణికంఠ ఇద్దరిపై కత్తితో దాడి చేసిన విషయాన్ని గమనించిన తెలగరెడ్డి హరీష్ అడ్డుపడ్డాడు. దీంతో హరీష్‌పై మణికంఠ దాడి చేసి కత్తితో పోడిచాడు. దీంతో స్థానికులు అప్రమత్తమై రక్తపు మడుగులో ఉన్న ముగ్గురినీ స్థానిక సీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అమలాపురంలోని కిమ్స్‌కు తరలించారు. ఈ వివాదంలో స్వల్పగాయాల పాలైన మణికంఠను కిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్సై సంపత్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. కిమ్స్ ఆస్పత్రిలో బాధితుల నుంచి పోలీసులు సమాచారం సేకరించి విచారణ చేస్తున్నారు.