జ్వరాలు వైరల్‌! | - | Sakshi
Sakshi News home page

జ్వరాలు వైరల్‌!

Aug 31 2025 12:46 AM | Updated on Aug 31 2025 12:46 AM

జ్వరా

జ్వరాలు వైరల్‌!

రోగులతో కిటకిటలాడుతున్న పీహెచ్‌సీలు

ప్రతి ఇంటా జ్వర బాధితులే

దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో సతమతం

వస్తే తగ్గడానికి వారం రోజుల సమయం

ప్రతి ఒక్కరికీ రూ.6 వేలకు పైగా ఖర్చు

ప్లేట్‌లెట్లు పడిపోతే

రూ.50వేల నుంచి రూ.70 వేల వ్యయం

జ్వరాలకు వర్తించని ఆరోగ్యశ్రీ

అప్పులు చేసి బిల్లులు కడుతున్న రోగులు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా ప్రజలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క జ్వరాల సీజన్‌ కాగా మరో పక్క దోమల దండయాత్రతో ప్రజలు రోగాలతో సతమతమవుతున్నారు. దీంతో ఏ ఆస్పత్రి చూసినా రోగులతో కిటకిటలాడుతున్నాయి. మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులతో ప్రజలు పోరాడుతున్నారు. అయితే అధికారులు మాత్రం అరకొర నివారణ చర్యలు తీసుకుని చేతులు దులుపుకొంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అనేక ప్రాంతాల్లో దోమలు ప్రజలపై దాడి చేస్తున్నాయి. పారిశుధ్య పనులు సక్రమంగా చేయకపోవడంతో దోమల కార్ఖానాలు జిల్లా వ్యాప్తంగా ఎక్కువైపోయాయి. జిల్లాలో 22 లక్షల జనాభా ఉండగా, 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 62 ఆరోగ్య సచివాలయాలు, 40 సామూహిక ఆరోగ్య కేంద్రాలు, 23 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, వంద మంది వైద్యులు, 1049 మంది పారా మెడికల్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. దోమల నియంత్రణకు అధికారులు అరకొరగానే చర్యలు చేపడుతున్నారు. ఒకపక్క వర్షాలు కురిస్తే ఇంటి ఆవరణలోనే పూల కుండీలు, నీటి ట్యాంకులు ఇంటిపై ఉన్న ఖాళీ స్థలాలలో నీరు ఎక్కువగా నిలబడి దోమలు విజృంభిస్తున్నాయి. వీధులు, కాలనీలు, శివారు ప్రాంతాలనే తేడా లేకుండా దోమల బెడద ఎక్కువుగా ఉంటోంది. జిల్లాలో పలు గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం చాలా అధ్వానంగా తయారైంది. దీంతో జ్వరాల బాధితులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నారు. గ్రామ పంచాయతీల్లో సరిపడినన్ని నిధులు లేకపోవడంతో గ్రామ పంచాయతీలో డ్రైనేజీలు కాలువలు కూడా శుభ్రం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. బ్లీచింగ్‌ ముగ్గు, ఫినాయిల్‌ వంటి పిచికారీ చేయాలంటే డబ్బులు అవసరం కాగా పంచాయతీల ఖజానాలు దాదాపు ఖాళీ అయిపోయాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు రావలసి ఉన్నప్పటికీ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీలు ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం క్షీణించి రోజురోజుకూ దోమలు పెరిగిపోవడం వల్ల ప్రజలు రోగాలను బారిన పడుతున్నారు.

కాకినాడ జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలకు ప్రతి నిత్యం 30 నుంచి 40 మంది జ్వరం బాధితులు వస్తున్నారు. కరప మండలంలోని కరప, వేళంగి పీహెచ్‌సీలు, ఆరోగ్య కేంద్రాల పరిధిలో నిత్యం 60 నుంచి 70 మంది జ్వరం, తదితర వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. పిఠాపురం మండలం చేబ్రోలు పీహెచ్‌సీలో ప్రతిరోజు 70 నుంచి 100 మందికి పైగా జ్వరం బారిన పడినవారు ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నారు. పెద్దాపురం మండలం పులిమేరు, కాండ్రకోట ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల్లో 70 నుంచి 80 మంది ప్రతి రోజు జ్వరం బాధితులు వైద్యానికి వస్తున్నారు. ఇక కాకినాడ జీజీహెచ్‌కు నిత్యం 500 మందికి తక్కువ కాకుండా జ్వరం బాధితులు వస్తున్నారు.

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో నిలువు దోపిడీ

జ్వరం వచ్చిందని ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళితే రూ.5 వేల నుంచి రూ.6 వేలు వసూలు చేస్తున్నారు. రక్త పరీక్షలు, సైలెన్‌ పెట్టి రూ.6 వేలకు తక్కువ కాకుండా బిల్లు చేతిలో పెడుతున్నారు. దీంతో రోగులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. రోగికి కానీ డెంగీ, మలేరియా వచ్చి ప్లేట్‌లెట్లు గానీ పడిపోతే రూ.50 వేల నుంచి రూ.60 వేలు గుంజేస్తున్నారు. ఈ బిల్లులు చెల్లించలేక సాధారణ, మధ్య తరగతి కుటుంబాలు వారు అప్పుల పాలవుతున్నారు.

డబ్బులు కడితేనే వైద్యం

జ్వరం వచ్చి ఆసుపత్రికి వెళ్లినా తగ్గకపోవడంతో ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళితే అక్కడ ప్లేట్‌లెట్లు పడిపోయాయని రోగులను భయపెట్టి మరీ డబ్బులు గుంజేస్తున్నారు. పోనీ దీనికి ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య చేయాలన్నా ఆయా ప్రైవేట్‌ ఆసుపత్రులలోని సిబ్బంది ఆరోగ్యశ్రీ దీనికి వర్తించదని డబ్బులు కడితేనే వైద్యం చేస్తామని ఇబ్బంది పెడుతున్నారు. రోగులు అప్పులు చేసి మరీ ఆసుపత్రులు బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొన్నాయి.

అరకొరగానే అవగాహన కార్యక్రమాలు

జ్వరాల సీజన్‌ వచ్చినా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో రోగులు భయపడి ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. వర్షాకాలం సీజన్‌ ప్రారంభం కాగానే అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇంటింటికీ వెళ్లి దోమల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అటువంటివేవీ సక్రమంగా జరగడం లేదు. పట్టణ గ్రామీణ ప్రజలు ప్రజలకు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఒకపక్క మలేరియా మరో పక్క డెంగీ కేసులు నిత్యం నమోదవుతూనే ఉన్నాయి.

డెంగీ రావడంతో రూ.70 వేల బిల్లు కట్టా

నాకు ఇటీవల డెంగీ జ్వరం రావడంతో పిఠాపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాను. వారు రూ.80 వేల బిల్లు వేశారు. అంత కట్టలేనని చెప్పడంతో రూ.10 వేలు తగ్గించారు. విధిలేక ఆ మొత్తాన్ని చెల్లించి బయటకు రావాల్సి వచ్చింది. ఐదు రోజులు ఆసుపత్రిలో ఉన్నదానికి ఇంత పెద్ద మొత్తం డబ్బులు చెల్లించాలంటే చాలా ఇబ్బంది పడ్డాను.

– మేడిశెట్టి దొరబాబు,

కొండెవరం, యుకొత్తపల్లి మండలం.

జ్వరాలు వైరల్‌!1
1/1

జ్వరాలు వైరల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement