సుజల ప్రాప్తిరస్తు.. | - | Sakshi
Sakshi News home page

సుజల ప్రాప్తిరస్తు..

Sep 1 2025 3:11 AM | Updated on Sep 1 2025 3:11 AM

సుజల

సుజల ప్రాప్తిరస్తు..

వర్షపు నీటిని ఒడిసిపట్టి.. రీ సైక్లింగ్‌

తొలిసారిగా అన్నవరం దేవస్థానంలో

రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ సిస్టమ్‌

లక్ష లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్‌ నిర్మాణం

సంతృప్తి వ్యక్తం చేసిన

దేవదాయ శాఖ కమిషనర్‌

అన్ని దేవస్థానాల్లో నిర్మించాలని ఆదేశం

అన్నవరం: ప్రముఖ పుణ్య క్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సాంకేతిక పరంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వర్షపు నీటిని ఒడిసిపట్టి, ట్యాంకులో నింపి, అదే నీటిని తిరిగి ఉపయోగించుకునే పద్ధతికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌.. 2023–24 మధ్య అన్నవరం దేవస్థానం ఈఓగా పని చేసినప్పుడు ఈ మేరకు ప్రణాళిక రూపొందించగా.. ఇప్పుడది కార్యరూపం దాల్చుతోంది.

అన్నవరం దేవస్థానంలోని సత్యగిరిపై నిర్మించిన 135 గదుల శివసదన్‌ సత్రంపై శ్లాబు మీద కురిసిన వర్షపు నీటిని పైపుల ద్వారా సేకరిస్తారు. సత్రం దిగువన నిర్మించిన లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకులోకి ఆ నీరు చేరేలా ఏర్పాట్లు చేశారు. ఆ ట్యాంకులో వర్షపు నీరు ఎంత మేర ఉందో తెలిపే మీటరు కూడా ఏర్పాటు చేశారు. ఈ వర్షపు నీటిని ఎప్పటికప్పుడు ఫిల్టర్‌(శుద్ధి) చేసే ప్రక్రియ కూడా ఈ ట్యాంకులో అమర్చారు. ఈ ట్యాంకు నిండినపుడు ఆ నీటిని మరలా శివసదన్‌ సత్రం పైన ఉన్న వాటర్‌ ట్యాంకుకు పంపించేలా మోటార్లు ఏర్పాటు చేశారు. సత్రం ఆవరణలో మొక్కల పెంపకానికీ ఈ నీటిని ఉపయోగించుకునే వీలుంది. రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ సిస్టమ్‌గా దీనిని పిలుస్తున్నారు.

కమిషనర్‌ సంతృప్తి

గత నెల ఒకటో తేదీన అన్నవరం దేవస్థానానికి విచ్చేసిన దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ ఈ ట్యాంకును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ట్యాంకు నిర్మాణం, ఇతర వివరాలను అన్ని దేవస్థానాలకు పంపాలని ఆదేశించారు. దేవస్థానంలోని హరిహర సదన్‌, ప్రకాష్‌ సదన్‌, న్యూ సీసీ, ఓల్డ్‌ సీసీ సత్రాల వద్ద కూడా ఇటువంటి వాటర్‌ ట్యాంకులు నిర్మించి, వర్షపు నీటిని పైపుల ద్వారా మళ్లించి, ఆ నీటిని ఫిల్టర్‌ చేసి వినియోగించుకునేలా చేయాలని కమిషనర్‌ నిర్దేశించినట్టు ఈఓ తెలిపారు.

రూ.20 లక్షల ఖర్చు

ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురవడంతో ఈ ట్యాంకు దాదాపుగా నిండిపోయింది. దీంతో ఈ నీటిని మరలా వాటర్‌ ట్యాంక్‌కు పంపడమో.. లేక మొక్కల పెంపకానికి ఉపయోగించడమో చేస్తామని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. ఈ ట్యాంకు, పైపులైన్‌, ఇతర నిర్మాణాలకు రూ.20 లక్షలకుపైగా ఖర్చు చేశామని వివరించారు. సాధారణంగా లక్ష లీటర్ల నీరు భూమి నుంచి సత్రం పైకి పంపించేందుకు చాలా విద్యుత్‌ అవసరమవుతుంది. సత్యగిరి కొండ ప్రదేశం కావడంతో బోర్లు వేసే అవకాశమూ తక్కువే. ఈ పరిస్థితుల్లో వర్షాకాలంలో ఎప్పటి కప్పుడు ఈ నీటిని తిరిగి వాటర్‌ ట్యాంక్‌కు పంపించడం ద్వారా నీటిని సద్వినియోగం చేయడంతోపాటు, విద్యుత్‌నూ ఆదా చేయవచ్చని తెలిపారు.

రీ సైక్లింగ్‌కు ఏర్పాట్లు చేశాం

దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ ఆదేశాల మేరకు శివసదన్‌ సత్రం టెర్రస్‌పై కురిసిన లక్ష లీటర్ల వర్షపు నీటిని సేకరించి, నిల్వ చేసే ట్యాంకు నిర్మించాం. ఇందులో నిల్వ అయ్యే నీటిని తిరిగి సత్రం అవసరాలకు, మొక్కల పెంపకానికి ఉపయోగించుకోవచ్చు. దేవదాయ శాఖలో ఈ విధమైన నీటి ట్యాంకు నిర్మించడం ఇదే ప్రఽథమం. అలాగే దేవస్థానంలో ఐదు చోట్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా ఇంజెక్షన్‌ వెల్స్‌ నిర్మించాం. దీనివల్ల భూమిలోకి నీరు ఇంకి, సత్యగిరి, రత్నగిరిల్లో మొక్కలకు సమృద్ధిగా నీరు అందుతుంది.

– వీర్ల సుబ్బారావు,

ఈఓ, అన్నవరం దేవస్థానం

సుజల ప్రాప్తిరస్తు..1
1/2

సుజల ప్రాప్తిరస్తు..

సుజల ప్రాప్తిరస్తు..2
2/2

సుజల ప్రాప్తిరస్తు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement