
ట్యాబ్‌లతో లబోదిబో
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 933
ప్రాథమికోన్నత పాఠశాలలు 105
ఉన్నత పాఠశాలలు 247
మొత్తం పాఠశాలలు 1,285
1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు
1,25,790
రెండేళ్ల పాటు విద్యార్థులకు అందజేసిన ట్యాబ్‌లు
43,081
ఖర్చు చేసిన మొత్తం – రూ.131.23 కోట్లు
బాలజీచెరువు (కాకినాడ సిటీ): ప్రతి విద్యార్థీ ఉన్నతంగా చదవాలి. ప్రపంచంతో పోటీ పడాలిశ్రీ అన్న లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ విద్యకు వెన్నుదన్నుగా నిలిచింది. సాంకేతిక విద్యపై విద్యార్థులు మక్కువ పెంచుకునేలా చర్యలు చేపట్టింది. కోట్ల రూపాయలు వెచ్చించి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఉచితంగా అందజేసింది. వీటి ద్వారా విద్యార్థులు సమోన్నతంగా ఎదిగేలా కృషి చేసింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పనిచేయని ట్యాబ్‌లతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది.
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హుందాగా వ్యవహరించాల్సింది పోయి దిగజారుడు రాజకీయాలకు తెర తీస్తోందంటున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లను అందజేసింది. 2022–23వ సంవత్సరం నుంచి వరుసగా రెండేళ్ల పాటు ట్యాబ్‌లు పంపిణీ చేసింది. ఆ ట్యాబ్‌ల ద్వారా అత్యాధునిక సాంకేతికతతో బోధించేవారు. పిల్లలు కూడా చక్కగా నేర్చుకునేవారు. రోజూ పాఠశాలకు తీసుకువచ్చి తరగతి గదిలో టీచర్లు బోధించే పాఠ్యాంశాలను విని.. తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు తమతో పాటు ట్యాబ్‌లను తీసుకువెళ్లేవారు. పాఠశాలల్లో ట్యాబ్‌ల వినియోగానికి ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని నిర్వీర్యం చేస్తోంది. కనీస పర్యవేక్షణ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లేకపోవడంతో అవి మూలన పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
లీప్ యాప్‌లో వీడియోలు
ఇటీవల కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న లీప్ యాప్‌లో వీడియోలను రూపొందించి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. ఆ వీడియో పాఠాలను టీచర్లు తరగతి గదిలో డిజిటల్ ప్యానల్ టీవీ ద్వారా బోధిస్తున్నారు. అయితే ట్యాబ్‌ల విషయం మరిచిపోయారు. ట్యాబ్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయకపోవడంతో చాలావరకు అవి పనిచేయడం లేదు. కొన్ని అసలు ఆన్ కావడం లేదు. ఎక్కడైనా టీచర్లు చొరవ తీసుకుని ట్యాబ్ ద్వారా బోధిద్దామని యత్నించినా పనిచేయడం లేదు. ట్యాబ్‌లను సరఫరా చేసిన సంస్థ టెక్నీషియన్లు పర్యవేక్షణ విభాగాన్ని మూసివేయడం మరింత ఇబ్బందిగా మారింది.
డిజిటల్ అసిస్టెంట్లు
ప్రతి నెలా పాఠశాలల సందర్శన
విద్యార్థులకు అందజేసిన ట్యాబ్‌లు దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ బాధ్యతలను డీఈఓ, డీవైఈఓ, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు గత ప్రభుత్వంలో అప్పగించేవారు. డిజిటల్ అసిస్టెం ట్లు ప్రతినెలా కనీసం ఒక్కసారి ప్రతి పాఠశాలనూ సందర్శించి ట్యాబ్‌లు పనితీరును చెక్ చేసి మరమ్మతు బాధ్యతలు కూడా వారే చూసేవారు. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పాఠశాలను సందర్శించి ప్రతి శుక్రవారం ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుడి ట్యాబ్‌లకు వైఫై కనెక్ట్ చేసి వినియోగ వివరాలను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసేవారు. బైజూస్, డిక్షనరీలను అందుబాటులో ఉంచి అప్‌డేట్ చేయడానికి ఎంఆర్సీ సిబ్బంది, సీఆర్పీలకు, పాఠశాల హెచ్‌ఎంలు, యాక్టివ్ టీచర్లు, డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చేవారు. పాఠశాల స్థాయిలోనే అప్డేట్ చేయించేవారు. అప్డేట్ చేసే క్రమంలో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించేవారు.
జిల్లా సమాచారం
ఒక్కొక్క ట్యాబ్‌కు రూ.30 వేల ఖర్చు
గత ప్రభుత్వంలో 8వ తరగతి
విద్యార్థులకు పంపిణీ
సాఫ్ట్‌వేర్ సమస్యలను
పట్టించుకోని కూటమి సర్కారు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
స్పందించని అధికారులు
సర్కారు బడుల్లో చదువుకునే విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దాలని గత ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తెచ్చింది. పాఠ్యాంశాలను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా బైలింగ్విల్ పద్ధతిలో పుస్తకాలను ముద్రించింది. 2022–23లో జిల్లాలోని విద్యార్థులు, టీచర్లకు కలిపి మొత్తం 23,099 ట్యాబ్‌లను పంపిణీ చేసింది. దీనికోసం రూ.67.23 కోట్లు ఖర్చు చేయగా 2023–24లో 380 పాఠశాలల్లో దాదాపు రూ.64 కోట్ల ఖర్చుతో 19,982 మందికి ట్యాబ్‌లను పంపిణీ చేసింది. ఇందుకోసం ఒక్కో ట్యాబ్‌పై సుమారు రూ.30 వేల దాకా ఖర్చుచేశారు. తమ వద్ద ఉన్న ట్యాబ్‌లు సాఫ్ట్‌వేర్ సమస్యలతో మొరాయిస్తున్నాయని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. సమస్యను టీచర్లు సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందనా లేదు.
పర్యవేక్షించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఇచ్చిన విలువైన ట్యాబ్‌లు ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ అప్డేట్ సమస్యతో పనిచేయడం లేదు. గత ప్రభుత్వం ఆ ట్యాబ్‌లను ఇవ్వడంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. విద్యాభివృద్ధి విషయంలో పర్యవేక్షణ లోపం ఉండడం సరైన పద్ధతి కాదు. వెంటనే ట్యాబ్‌లకు మరమ్మతులు చేయాలి.
– ఎం.గంగాసూరిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
విద్యార్థులకు ఉపయోగం
గత ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు అందజేసిన ట్యాబ్‌లు ఎంతో ఉపయోగకరమైనవి. దేశంలో ఎక్కడా విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చిన దాఖలా లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల అభివృద్ధి కోసం గత ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వారికి అందజేసిన ట్యాబ్‌లు పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
– కె.లలిత్‌కుమార్, స్టేట్ స్టూడెంట్ బెవలప్‌మెంట్ కన్వీనర్, విద్యార్థి పరిషత్

ట్యాబ్‌లతో లబోదిబో

ట్యాబ్‌లతో లబోదిబో