
ఏలేరుకు వరద నీరు
ఏలేశ్వరం: పరివాహక ప్రాంతంలో పడుతున్న వర్షాలకు ఏలేరుకు వరద నీరు వచ్చి చేరుతోంది. రెండురోజులుగా పడుతున్న వర్షాలకు మంగళవారం ప్రాజెక్టులోకి 5,218 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. మరో రెండురోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలపడంతో మరింతగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరనుంది. దీంతో అఽధికారులు అప్రమత్తమయ్యారు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి 525 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 86.46 మీటర్లకు 79.25 మీటర్లు, 24.11 టీఎంసీలకు 12.59 టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. దీంతో విశాఖకు 200, తిమ్మరాజుచెరువుకు 20 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ఆయకట్టుకు నీటి విడుదల నిలిపివేశారు.
పంపా కాలువకు గండి
తుని రూరల్: తుని మండలం టి.తిమ్మాపురం, తొండంగి మండలం వలసపాకల (పి.అగ్రహారం) సమీపంలో పంపా వరదనీటి కాలువకు సోమవారం రాత్రి గండిపడింది. ఆ ప్రాంతాన్ని, నీటమునిగిన పంట పొలాలను ఇరిగేషన్ అధికారులతో కలసి తుని నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎన్.శ్రీధర్ మంగళవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. యుద్ధప్రతిపాదికన గండిని పూడ్చేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రెండువేల ఇసుక బస్తాలతో తాత్కాలికంగా గండిని పూడ్చివేస్తామన్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు, పుష్కరనీరు అందుబాటులోకి రావడంతో ఇటీవల రైతులు వరినాట్లు వేస్తున్నారు. టి.తిమ్మాపురం గ్రామానికి చెందిన 30ఎకరాలకు పైగా పంటలు నీటిముంపునకు గురైనట్టు స్థానికులు పేర్కొన్నారు.
స్థల వివాదంపై
22న ట్రావెర్స్ సర్వే
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఘాట్ రోడ్ పక్కనే పంపా రిజర్వాయర్‌ను ఆనుకుని ఉన్న స్థలంపై దేవస్థానం, ఇరిగేషన్ శాఖల మధ్య నెలకొన్న వివాదానికి తెర దించేందుకు ఈ నెల 22న టావెర్స్ సర్వే నిర్వహించాలని కలెక్టర్ షణ్మోహన్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ స్థలం దేవస్థానానికి చెందుతుందా లేక, ఇరిగేషన్ శాఖకు చెందుతుందా అనే దానిపై 15 సంవత్సరాలుగా ఈ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికి నాలుగుసార్లు సర్వే చేశారు. మొదటిసారి సర్వే మధ్యలో నిలిచిపోయింది. రెండోసారి నిర్వహించిన సర్వేలో స్థలం దేవస్థానానిదే అని తేలినా ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో కలెక్టర్ మూడోసారి జాయింట్ సర్వేకు ఆదేశించారు. ఏప్రిల్ ఒకటిన పెద్దాపురం ఆర్డీఓ రమణి పర్యవేక్షణలో దేవస్థానం, ఇరిగేషన్ అధికారుల సమక్షంలో సర్వే చేశారు. దానిపై ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం తెలపడంతో ట్రావెర్స్ సర్వేకు ఆదేశాలిచ్చారు. ట్రావెర్స్ సర్వేలో వివాద స్థలం ముందు వెనుక గల స్ధలాలను కూడా సర్వే చేస్తారు. సర్వే అధికారులు ఎక్కడికక్కడ సర్వే రాళ్లు పాతి దీనిని నిర్వహిస్తారు. రత్నగిరి కొండ పరిధిలో గల 24 బీ సర్వే నంబర్‌లో స్థలంలో ట్రావెర్స్ సర్వే చేయనున్నారు.