
ఆటో యూనియిన్ కార్మికుల నిరసన
జగ్గంపేట: జగ్గంపేటలో ఆటో యూనియన్ కార్మికులు ఉచిత బస్సు వల్ల తమ ఉపాధి దెబ్బతిందని, నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉచిత బస్ ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం మా కష్టాలను కూడా పట్టించుకుని అన్ని విధాల ఆదుకోవాలని కోరుతూ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, తహసీల్దార్ జేవీఆర్ రమేష్‌కు అందజేశారు. జగ్గంపేటలో ఉన్న నాలుగు ఆటో యూనియిన్‌లకు చెందిన సుమారు 1,000 మంది కార్మికులు ఆటోయూనియన్ జేఏసీ పేరుతో జగ్గంపేటలో ప్రధాన వీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆటోలతో సహా ర్యాలీగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఎమ్మెల్యేకు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. తాము అప్పులు చేసి వాహనాలు కొన్నామని, ఉచిత బస్ వల్ల తమ ఆదాయం దారుణంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఆటో కార్మికుడుకి రూ.12,000 జీవనభృతిగా చెల్లించాలని, ఆర్టీఓ ఫిటెనెస్ సర్టిఫికెట్ విషయమై ప్రయివేటీకరణ రద్దు చేయాలని, వాహన మిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.30వేలు చెల్లించాలని, ఆటో కార్మికులు పిల్లలకు విద్యార్హతను బట్టి అందరికీ ఉద్యోగాలు కల్పించాలని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రుకు అందజేశారు. ఆటో యూనియన్ నాయకులు ఆర్.వెంకటరమణ, ఆర్.శివశంకర్, మంజేటి సత్యనారాయణ, వి.ప్రసాద్ పాల్గొన్నారు.
ఉచిత బస్ మా పొట్ట కొడుతోంది
అంటూ ఆవేదన