
పంపా నీళ్లు వృథా
● నాలుగో వంతు సముద్రం పాలు
● గేట్లు బలహీనంతో సమస్య
● 103 అడుగుల గరిష్ట
నీటిమట్టం నిర్వహించలేని దుస్థితి
అన్నవరం: వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసి ఏడాది పొడవునా తాగు, సాగు అవసరాల కోసం నిర్మించిన అన్నవరంలోని పంపా రిజర్వాయర్ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంపాలోకి వెల్లువలా వర్షపు నీరు తరలివస్తున్నా దానిని నిల్వ ఉంచుకోలేని పరిస్థితి నెలకొంది. రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 103 అడుగులు కాగా, వివిధ కారణాల వల్ల 99 అడుగులు నీటిమట్టం వరకు మాత్రమే నిల్వ ఉంచుకోవల్సిన పరిస్థితి. అంటే నాలుగు అడుగుల మేర నీరు వృథాగా వదిలేయాల్సి వస్తోంది. రిజర్వాయర్ గరిష్ట నీటినిల్వ 0.43 టీఎంసీలు కాగా దాదాపు నాలుగో వంతు నీటిని వృథాగా వదిలేస్తున్నారు. పంపా బ్యారేజీకి కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోవడం, ఉన్న గేట్లకు కూడా మరమ్మతులు పూర్తి చేయలేకపోవడంతో ఈ నీటిని వదిలేయాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. పంపాగర్భంలో నిర్మాణంలో ఉన్న పోలవరం అక్విడెక్ట్ పనుల కారణంగా కూడా పంపా నీటిమట్టం 99 అడుగులకే పరిమితం చేయాల్సి వస్తోందని తెలిపారు. అయితే 12,500 ఎకరాల పంపా ఆయకట్టు పూర్తిగా సాగవ్వాలంటే 1.5 టీఎంసీల నీరు అవసరం. పంపా నీటి నిల్వ పరిమాణం 0.43 టిఎంసీ మాత్రమే. అంటే సుమారు మూడు సార్లు పంపా నిండితే తప్ప సాగవ్వని పరిస్థితి. పంపా నీటిమట్టం 99 అడుగులకే పరిమితం చేస్తే నీటినిల్వ పరిమాణం ఇంకా తగ్గిపోతుంది. దానివలన వర్షాలు తగ్గిన తరువాత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు విడుదల జరగదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బలహీనంగా బ్యారేజీ గేట్లు
తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాలలో 12,500 ఎకరాలకు సాగునీరు, అన్నవరం దేవస్థానం, వివిధ గ్రామాల ప్రజలకు తాగునీరు అందించేందుకు 55 ఏళ్ల క్రితం అన్నవరంలో పంపా రిజర్వాయర్ నిర్మించిన విషయం తెలిసిందే. పంపా బ్యారేజీకి ఏర్పాటు చేసిన ఐదు గేట్లు 20 సంవత్సరాలుగా మరమ్మతులకు గురవడంతో వీటి నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. వరదల సమయంలో గేట్లు ఎత్తడం, దించడం సమస్యగా మారింది. ఫలితంగా వేల క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు పోయి, గ్రామాలు, పొలాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పంపా బ్యారేజీకి ఐదు గేట్లు నిర్మించేందుకు 2023 ఆగస్టులో రూ.3.36 కోట్లు మంజూరు చేసింది. 2024 ఎన్నికల కోడ్ రావడంతో ఆ నిధులు విడుదల కాలేదు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లో టెండర్లు పిలిచింది. అయితే ఈ టెండర్లు మూడుసార్లు పిలిస్తే తప్ప ఖరారు కాలేదు. చివరగా మే నెలలో ఈ టెండర్లు ఖరారయ్యాయి.
ఖరీఫ్‌లోగా కొత్త గేట్ల ఏర్పాటు సాధ్యంకాదు కనుక పాత గేట్లకు తాత్కాలికంగా మరమ్మతులు చేయడానికి నిర్ణయించారు. నాలుగో నెంబర్ గేటుకు జూలై మొదటి వారంలో మరమ్మతులు చేశారు. అయితే అప్పటికే వర్షాల వల్ల గేట్ల వద్దకు నీరు రావడంతో ఆ పని నిలిపివేశారు. దాంతో సమస్య ఎప్పటి లాగానే ఉంది. దీంతో ఐదు రోజులుగా వేయి క్యూసెక్కుల చొప్పున సముద్రానికి విడుదల చేస్తున్నారు.
పోలవరం అక్విడెక్ట్ మునగకుండా ఉండాలన్నా..
పంపా రిజర్వాయర్ ఎగువన నిర్మిస్తున్న పోలవరం అక్విడెక్ట్ మునిగిపోకుండా ఉండాలంటే పంపా నీటి మట్టం 99 అడుగులకు మించకుండా ఉండాలి. అదే విషయాన్ని పోలవరం అధికారులు కలెక్టర్‌కు తెలియచేయడంతో ఆ మేరకు నీటిమట్టాన్ని నియంత్రిస్తున్నారు.