
రాష్ట్రంలో స్తంభించిన పరిపాలన
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయిందని, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, మర్డర్లు, మహిళలపై అఘాయిత్యాలు, భూకబ్జాలు పెరిగిపోయాయని రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన అక్రమ మద్యం కేసులో అరెస్టయి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డితో ములాఖత్ అయ్యారు. అనంతరం బొమ్మూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ బొత్స సత్యనారాయణ ముఖ్యనేతలతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఒకపక్క అధిక వర్షాలు వచ్చి రైతులకు కావాల్సిన ఎరువులను అందించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. కూటమి ప్రభుత్వానికి అవగాహన, కార్యాచరణ, ముందుచూపులేకపోవడం వలన రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎం చంద్రబాబు ఎక్స్‌పీరియన్స్ అంటూ సొల్లు కబుర్లు చెప్పడమే తప్ప ఆచరణలో లేదని బొత్స విమర్శించారు. కూటమి ప్రభుత్వం మంచిపాలనను ఐదురోజుల నుంచి చూస్తున్నాం వారి శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో తెలుస్తోందన్నారు. శాసనమండలి ప్రతిపక్షనేతగా ఉన్న తాను ప్రెస్‌తో మాట్లాడుతుండగా డ్రోన్ ఎగురవేయడంపై ఆయన మండిపడ్డారు. ఏమైన అడిగితే లా అండ్ ఆర్డర్ సమస్య అంటారన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని, చట్టం తన పనిచేసుకునేలా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలన్నారు. అమరావతి ముంపు సమస్యపై విలేకరుల అడిగిన ప్రశ్నకు పదిరోజుల్లో అంతా తెలుస్తుందని బొత్స బదులిచ్చారు. ఫ్రీ బస్సు ఎవరు అడిగారని ప్రశ్నించారు. ఎన్నికల హామీల్లో గొప్పగా ఇక్కడ బస్సు ఎక్కితే తిరుపతి వెళ్లవచ్చన్నారు. కానీ మోసం చేశారన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీమంత్రి తానేటి వనిత, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎంపీలు మార్గాని భరత్‌రామ్, చింతా అనురాధ, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తిసూర్యనారాయణరెడ్డి, జి.శ్రీనివాసనాయుడు, తలారి వెంకటరావు, పాముల రాజేశ్వరిదేవి, రౌతు సూర్యప్రకాశరావు, రాజమహేంద్రవరం పార్లమెంటు ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్లమెంటు పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు దవులూరి దొరబాబు, పిల్లి సూర్యప్రకాశ్, డాక్టర్ పినిపే శ్రీకాంత్, చిన్నమిల్లి వెంకట్రాయుడు, గన్నవరపు శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, వివిధ నియోజకవర్గాల పార్టీ నేతలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
శాసనమండలి ప్రతిపక్ష నేత,
వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స