అన్నవరం: సత్యదేవునికి హుండీల ద్వారా గత 25 రోజులకు గాను రూ.1,19,10,877 ఆదాయం వచ్చింది. అన్నవరం దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. నగదు రూ.1,11,50,975, చిల్లర నాణేలు రూ.7,59,902 వచ్చాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. వీటితో పాటు బంగారం 25.800 గ్రాములు, వెండి 512 గ్రాములు వచ్చాయన్నారు. రోజుకు సరాసరిన రూ.4,76,435 హుండీ ఆదాయం వచ్చిందని చెప్పారు. హుండీల ద్వారా అమెరికా డాలర్లు 46, సౌదీ సెంట్రల్ బ్యాంక్ రియల్స్ 5, ఆస్ట్రేలియా డాలర్లు 20, యూఏఈ దీరామ్స్ 105, యూరోలు 60, మలేషియా రింగిట్స్ 15 లభించాయి. కార్యక్రమంలో చైర్మన్, ఈఓలతో పాటు శ్రీవారి సేవ, శ్రీహరి సేవ తదితర స్వచ్ఛంద సేవా సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. హుండీల్లో వచ్చిన నగదును స్థానిక స్టేట్ బ్యాంకుకు తరలించారు.


