నేతి చమురు వదిలిపోయేలా..
అన్నవరం: సత్యదేవునికి ‘నేతి’ చమురు భారీగానే వదిలిపోనుంది. స్వామివారి ప్రసాదం తయారీకి అవసరమైన ఆవు నేతిని ఇప్పటి వరకూ కొటేషన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే నెల నుంచి టెండర్ ద్వారా నెయ్యి కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు ఈ–ప్రొక్యూర్‌మెంట్ ద్వారా నెయ్యి కొనుగోలుకు గత నెల 30న దేవస్థానం అధికారులు టెండర్లు పిలిచారు. ఇందులో సంగం డెయిరీ (గుంటూరు), విజయా డెయిరీ (విజయవాడ) టెండర్‌లో పాల్గొని టెక్నికల్ బిడ్‌కు అర్హత సాధించాయి. ప్రైస్ బిడ్ మంగళవారం తెరవగా..
సంగం డెయిరీ కిలో రూ.639.90కి, విజయా డెయిరీ కేజీ రూ.660కి కోట్ చేశాయి. దీంతో, అతి తక్కువ ధర కోట్ చేసిన సంగం డెయిరీ ఈ టెండర్‌ను దక్కించుకుంది. ఈ డెయిరీ జనవరి 1 తేదీ నుంచి జూన్ 30 వరకూ ఆరు నెలల పాటు అన్నవరం దేవస్థానానికి ఆవు నెయ్యి సరఫరా చేయాల్సి ఉంటుంది.
కిలోకు రూ.50 అధికం
గత ప్రభుత్వ హయాంలో టెండర్ పిలిచి నెయ్యి కొనుగోలు చేసేవారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి వరకూ ఉన్న టెండర్లను రద్దు చేసి సహకార డెయిరీల నుంచి కొటేషన్లు పిలిచి నెయ్యి కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఆ మేరకు సంగం, విజయా డైరీల నుంచి కిలో సుమారు రూ.590కి కొంటున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి టెండర్లు పిలిచి ఆవు నెయ్యి కొనుగోలు చేయాలని గత ఆగస్టులో కమిషనర్ ఆదేశించారు. అయినప్పటికీ నవంబర్ వరకూ కొటేషన్ ద్వారానే కొనుగోలు చేశారు. దీనిపై దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు అప్పటి ఈఓ వీర్ల సుబ్బారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే టెండర్ పిలిచి కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు టెండర్ పిలవగా దీనిని సంగం డెయిరీ దక్కించుకుంది.
సత్యదేవుని ప్రసాదం తయారీకి ప్రతి నెలా 18 వేల నుంచి 20 వేల కిలోల వరకూ నెయ్యి ఉపయోగిస్తారు. ఇప్పుడు టెండర్ దక్కించుకున్న సంగం డెయిరీ జనవరి 1 నుంచి జూన్ 30 వరకూ సుమారు 1.10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయాలి. కిలో రూ.639.90 చొప్పున నేతి కొనుగోలుకు సుమారు రూ.7.04 కోట్ల మేర దేవస్థానం సంగం డెయిరీకి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొటేషన్‌పై కొనుగోలు చేస్తున్న దానికన్నా సంగం డెయిరీ రూ.50 ఎక్కువకు కోట్ చేయడం గమనార్హం. దీని ప్రకారం 1.10 లక్షల కిలోల నేతికి దేవస్థానం అదనంగా రూ.55 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫ ‘సంగం’కే ఆవునేతి టెండర్
ఫ కిలో రూ.639.90కి కోట్ చేసిన డెయిరీ
ఫ ఇప్పటి వరకూ కొటేషన్ ద్వారా కిలో రూ.590కే కొనుగోలు
ఫ ప్రస్తుతం 6 నెలలకు రూ.7.04 కోట్ల వ్యయం
ఫ తాజా ధరతో 6 నెలలకు రూ.55 లక్షల భారం


