నీతి, నిజాయితీలకు మారుపేరు ముద్రగడ
కిర్లంపూడి: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఉమ్మడి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో నీతి, నిజాయితీలకు మారుపేరని ఆ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ముద్రగడను కిర్లంపూడిలోని ఆయన నివాసంలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలుసుకుని, ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముద్రగడ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, అమర్నాథ్ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ విలేకర్లతో మాట్లాడుతూ, ఇటీవల అనారోగ్యానికి గురైన ముద్రగడ ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు.
లక్షలాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజల ఆశీస్సులు ఆయనకు నిండుగా ఉన్నాయన్నారు. పద్మనాభం రాజకీయ అనుభవాలు, సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ఆయన సేవలు పార్టీకి ఎంతో అవసరమని చెప్పారు. ముద్రగడ ఒక ప్రాంతానికి పరిమితమైన నాయకుడు కాదని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అభిమానులు ఆయనకున్నారని అన్నారు. ఆయనను ఒక కులానికే నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని, కానీ, అన్ని కులాలనూ ఆదరిస్తూ, అందరికీ అండగా నిలుస్తున్న నాయకుడు ముద్రగడ అని వివరించారు. అలాంటి మహానాయకుడి ఆశీస్సులు అందుకోవడానికే తాను వచ్చానని చెప్పారు. అమర్నాథ్ వెంట మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు చిక్కాల రామారావు, ఏడువాక సత్యారావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దొండ రాంబాబుతో పాటు చోడవరం, అనకాపల్లి నియోజకవర్గాల పార్టీ శ్రేణులు ఉన్నాయి.
ఫ ఆయన కుటుంబంతో నాలుగున్నర దశాబ్దాల అనుబంధం
ఫ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్


