శాసీ్త్రయ దృక్పథంతో సమస్యలకు పరిష్కారం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): శాసీ్త్రయ దృక్పథంతో ఆలోచిస్తేనే సమాజంలోని సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుందని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి.గోపీమూర్తి అన్నారు. జన విజ్ఞాన వేదిక (జేవీవీ) ఆధ్వర్యాన జేఎన్‌టీయూకేలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న చెకుముకి రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన ప్రగతి ఫలాలు సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని అన్నారు.
సభకు అధ్యక్షత వహించిన జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ, మూఢ విశ్వాసాల నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, అందరికీ విద్య, నాణ్యమైన వైద్యం కోసం 38 సంవత్సరాలుగా జేవీవీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. భావితరాలకు ఉన్నత, అభివృద్ధికర సమాజాన్ని అందించేందుకు, శాసీ్త్రయ దృక్పథం పెంపొందించేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకు, సైన్స్, ప్రయోగాల పట్ల ఆసక్తి రేకెత్తించేందుకు, సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఏటా పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది పాఠశాల స్థాయి సైన్స్ సంబరాల్లో 4.60 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. వచ్చే నెలలో సైన్స్ ప్రయోగాల పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు హేతుబద్ధమైన ఆలోచన కలిగి ఉంటేనే భావితరాలకు మంచి సమాజాన్ని అందించగలుగుతామని అన్నారు. కార్యక్రమంలో సంబరాల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, కాకినాడ సీ పోర్ట్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి ఎం.మురళీధర్, కోరమండల్ ఇంటర్నేషనల్ అధికారి వంశీకృష్ణ, సత్యా స్కాన్ డైరెక్టర్ డాక్టర్ కాదా వెంకట రమణ, చెకుముకి రాష్ట్ర కన్వీనర్ కేఎంఎంఆర్ ప్రసాద్, యూటీఎఫ్ నాయకుడు ప్రభాకరవర్మ, జేవీవీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి విజేతలు వీరే..
జిల్లా స్థాయి పోటీల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విభాగాల్లో మొదటి స్థానం సాధించిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాలకు హాజరయ్యారని జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్ తెలిపారు. వారికి ప్రయోగాలు, క్విజ్, విజువల్ రౌండ్, రాత పరీక్ష నిర్వహించి, విజేతలను ఎంపిక చేశామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ స్కూల్ (కర్నూలు జిల్లా) ప్రథమ, శ్రీ నరసింహ గవర్నమెంట్ హైస్కూల్ (గుంటూరు) ద్వితీయ, జెడ్పీ గర్‌ల్స్ హైస్కూల్ (బుదిరెడ్డిపల్లి, శ్రీ సత్యసాయి జిల్లా) తృతీయ స్థానాల్లో నిలిచాయని వివరించారు. ప్రైవేటు పాఠశాలల విభాగంలో ది ఎతేనా స్కూల్ (కర్నూలు) ప్రథమ, శ్రీ సాయి విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ (వైఎస్సార్ కడప) ద్వితీయ, ఆదిత్య ఇంగ్లిష్ మీడియం స్కూల్ (గంగరాజు నగర్, కాకినాడ) తృతీయ స్థానాలు సాధించాయని తెలిపారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులకు, పాఠశాలలకు సర్టిఫికెట్, జ్ఞాపికలను ఎమ్మెల్సీ గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, డీఓ రమేశ్ తదితరుల చేతుల మీదుగా అందజేశారు.
ఫ ఎమ్మెల్సీ గోపీమూర్తి
ఫ ముగిసిన చెకుముకి రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాలు


