వేసవి తాపం నుంచి ఉపశమనం కల్పించాలి
అన్నవరం: దేవస్థానంలో భక్తులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఆదేశించారు. అన్నవరం దేవస్థానం అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేవస్థానంలో సాధ్యమైనన్ని ఎక్కువ ప్రదేశాల్లో చలువ పందిళ్లు వేయించాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కాళ్లు కాలకుండా కూల్ పెయింట్ వేయించాలని ఆదేశించారు. అలాగే, కాయర్ కార్పెట్లను ఉపయోగించాలన్నారు. దేవస్థానం వైద్యశాల, రత్నగిరిపై నిర్వహిస్తున్న వైద్య కేంద్రంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లతో పాటు అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే, అన్నిచోట్లా భక్తులకు మంచినీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, డీసీ చంద్రశేఖర్, ఏసీ రామ్మోహన్‌రావు, ఈఈలు నూకరత్నం, రామకృష్ణ, ఏఈఓలు, వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్, ఫార్మసీ సూపర్‌వైజర్ వి.మాధవి పాల్గొన్నారు.
బస్సును ఢీకొన్న ఆటో
పలువురికి గాయాలు
జగ్గంపేట: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. తుని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమహేంద్రవరం వైపు వెళ్తోంది. జగ్గంపేట మండలం రామవరం శివారుకు వచ్చేసరికి ప్రయాణికుడి కోసం బస్సును డ్రైవర్ అకస్మాత్తుగా రోడ్డుపై ఆపాడు. దీంతో, వెనుకనే వస్తున్న ఆటో అదుపు తప్పి బస్సు వెనుక వైపు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు స్వల్పంగా గాయపడ్డారు. ఆటో డ్రైవర్ తలకు బలమైన గాయమైంది. అతడిని హైవే అంబులెన్స్‌లో జగ్గంపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
మైనారిటీల నుంచి
దరఖాస్తుల ఆహ్వానం
కాకినాడ సిటీ: ఉపాధి కల్పన పథకంలో రుణాలు పొందడానికి ముస్లిం, క్రైస్తవ, జైన, సిక్కు, బౌద్ధ, పారశీకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ ఎం.సునీల్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గరిష్టంగా తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవా రంగానికి రూ.20 లక్షల వరకూ రుణం అందిస్తారన్నారు. ప్రాజెక్టు ఏర్పాటు చేసే ప్రాంతం నుంచి లబ్ధిదారుల వర్గీకరణను బట్టి ప్రాజెక్టు విలువలో 15 నుంచి 35 శాతం వరకూ కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఉంటుందని వివరించారు. లబ్ధిదారు వాటా 5 శాతంతో ఏదైనా బ్యాంకు నుంచి రుణ సహాయం కల్పిస్తారన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం, ఖాదీ బోర్డు, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ద్వారా సంబంధిత బ్యాంకులతో సంప్రదించి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. రుణం పొందగోరే అభ్యర్థుల కనీస వయసు 18 సంవత్సరాలు దాటి ఉండాలన్నారు. గరిష్ట వయో, ఆదాయ పరిమితులు లేవని తెలిపారు. తయారీ రంగంలో రూ.10 లక్షలు పైబడిన ప్రాజెక్టులు, సేవా రంగంలో రూ.5 లక్షలు పైబడిన ప్రాజెక్టుల స్థాపనకు అభ్యర్థులు కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని వివరించారు. కొత్త ప్రాజెక్టులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. పాస్‌పోర్టు సైజ్ ఫొటో, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, అవసరమైన చోట ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్, గ్రామీణ ప్రాంత ధ్రువీకరణ, డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు, విద్య, సాంకేతిక, ఈడీపీ శిక్షణ ధ్రువీకరణ పత్రం, ఇతర పత్రాలతో వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సునీల్‌కుమార్ సూచించారు.
రూ.30.86 లక్షల
హుండీ ఆదాయం
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. ఆలయ హుండీల ద్వారా రూ.28,86,128, అన్నదాన ట్రస్ట్ హుండీల ద్వారా రూ.1,99,937 కలిపి మొత్తం రూ.30,86,065 ఆదాయం లభించిందని అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు. దీంతో పాటు 19.500 గ్రాముల బంగారం, 260 గ్రాముల వెండి, మూడు విదేశీ కరెన్సీ నోట్లు కూడా లభించాయన్నారు. మొత్తం 120 రోజులకు గాను నిర్వహించిన ఈ హుండీల లెక్కింపును దేవదాయ శాఖ తాడేపల్లిగూడెం తనిఖీదారు బీఎల్ నరసింహరావు పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది నిర్వహించారు.


