గట్టు: గ్రామ పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం మరింత ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో గ్రామాల్లో ప్రభుత్వం నూతన పంచాయతీ భవనాల నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు కేటాయించింది. అయితే క్షేత్రస్థాయిలో నిధులు సకాలంలో చెల్లించరనే సాకుతోపాటు కొన్నిచోట్ల వర్గపోరు కారణంగా నూతన భవనాల నిర్మాణాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. నూతన పంచాయతీ భవన నిర్మాణాలు చాలా చోట్ల నత్తనడకన సాగుతుండగా.. వీటిని ఎప్పటికి పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు సరైన పంచాయతీ భవనాలు లేక పంచాయతీ పాలకులు, కార్యదర్శులు ఇబ్బంది పడుతూ వస్తున్నారు. జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం గతంలో నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేరాయి. వీటిలో సభలు సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలు లేకుండా పోవడంతో పంచాయతీ భవనాన్ని వేరే చోట కొనసాగిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామాల్లో భవనాలు లేక అద్దె గదుల్లో పంచాయతీలను కొనసాగిస్తున్నారు. ప్రతి పంచాయతీకి తప్పనిసరిగా సొంత భవనాలు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వీబీజీ రాంజీ పథకం ద్వారా పంచాయతీ భవనాలను నిర్మించుకునేందుకు సిద్ధమై.. నిధులు కేటాయించింది. జిల్లావ్యాప్తంగా 71 నూతన పంచాయతీ భవనాలను మంజూరు చేయగా, వాటిల్లో 25 చోట్ల ఇప్పటి వరకు నూతన పంచాయతీ భవనాల నిర్మాణ పనులు ప్రారంభించలేదు.
ఒక్కో భవనానికి రూ.20 లక్షలు
జిల్లావ్యాప్తంగా 71 గ్రామాలకు నూతన భవనాలు మంజూరు చేశారు. వీటి కోసం రూ.14.20 కోట్లు కేటాయించగా.. ఒక్కో భవనానికి రూ.20 లక్షలు మంజూరు చేశారు. వీబీజీ రాంజీ పథకం ద్వారా నూతన పంచాయతీ భవనాలు నిర్మించనున్నారు. అయితే గతంలో సర్పంచుల హయాంలో జరిగిన పనులకు ఇప్పటికీ కొంతమందికి బిల్లులు రాకపోవడంతో వారు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో పంచాయతీల్లో పనులు చేపట్టాలంటే కాంట్రాక్టర్లు కాస్త వెనకా ముందు ఆలోచించే పరిస్థితి నెలకొంది. దీని కారణంగా నూతన పంచాయతీ భవనాల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. అయితే వీబీజీ రాంజీ పథకంలో చేపట్టిన పనులకు ఆలస్యం లేకుండా త్వరగా బిల్లులు ఇచ్చేలా చూస్తామని పంచాయతీరాజ్ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. మరి ఎంత వరకు ఉత్సాహం చూపి, భవన నిర్మాణాలను పూర్తి చేస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
4 చోట్ల స్థల సమస్య..
జిల్లాలోని 4 భవనాల నిర్మాణాలు పూర్తి చేసుకోగా, మరో 4 చోట్ల భవనాల నిర్మాణానికి స్థల సమస్య అడ్డంకిగా మారింది. ధరూరు మండలం పెద్దపాడు, గట్టు మండలం ఆరగిద్ద, ఇటిక్యాల మండలం నక్కలపల్లి, అయిజ మండలం ఉప్పలక్యాంపులో స్థల సమస్య కారణంగా, మరో నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఇక మిగిలిన 25 పంచాయతీల్లో పనులను ప్రారంభించ లేదు. మరో 42 పంచాయతీల్లో నూతన భవన నిర్మాణం ప్రారంభమై.. పనులు కొనసాగుతున్నాయి. మరో 46 పంచాయతీల్లో నూతన భవన నిర్మాణానికి గ్రౌండింగ్ పూర్తి చేసినట్లు పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు.
నత్తనడకన నూతన భవనాల నిర్మాణాలు
బిల్లుల చెల్లింపులో జాప్యమవుతోందని ముందుకు రాని కాంట్రాక్టర్లు
మరోవైపు అద్దె గదులు, అంగన్‌వాడీల్లో నిర్వహణతో అవస్థలు
జిల్లాలో 71 భవనాలకు రూ.14.20 కోట్లు మంజూరు


