అయిజ: చేనేత కళాకారులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, పథకాలు సక్రమంగా అందాలంటే మగ్గాలకు జిమో ట్యాగింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలని అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ బాలకృష్ణ అన్నారు. చేనేత మగ్గాలకు జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఇందిర ఆదేశాల మేరకు అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ బాలకృష్ణ మంగళవారం అయిజలోని చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి మగ్గాలను పరిశీలించి, వాటికి జియో ట్యాగింగ్ నంబర్లు కేటాయించారు. జియో ట్యాగింగ్ లేని చేనేత కార్మికులు ఈనెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షుడు వీరన్న, కార్యదర్శి బసవరాజు, సొసైటీ మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు
మానవపాడు: మండలంలోని పల్లెపాడు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను మంగళవారం రాష్ట్ర ఎస్‌బీఎం స్టేట్ డైరెక్టర్ సురేష్‌బాబు, అదనపు కలెక్టర్ నర్సింగరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జలసిరి కార్యక్రమం కింద తవ్విన గుంతలు, మురుగుదొడ్లు, నీటికుంటలను పరిశీలించి.. భూగర్భజలాలు పెంపొందించేందుకు చేపట్టిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు ఏ విధంగా తీసుకోవాలో వివరించారు. అనంతరం స్వచ్ఛభారత్ మిషన్ కింద గ్రామంలో నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశీలించి.. వినియోగంపై గ్రామస్తులతో మాట్లాడారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించి వెంటనే నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, మురుగు కాల్వల పరిశుభ్రతపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. డ్రెయినేజీలు పూడిక లేకుండా చూడాలని, చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని చెప్పారు. జలసిరి భూగర్భజలాలు పెరిగి రైతులకు మేలు జరుగుతుందన్నారు.
పల్లీ @ రూ.7,750
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 222 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ.7,750, కనిష్టంగా రూ.4,591, సరాసరిగా రూ.6,069 ధరలు లభించాయి. 8 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటాల్ రూ.7,139 ఒకే ధర పలికింది.


