రైతులకు సాగునీటి కష్టాలు తీర్చాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు సాగునీటి కష్టాలు తీర్చాలి

Aug 20 2026 3:34 AM | Updated on Aug 20 2026 3:34 AM

అలంపూర్‌: రైతులకు సాగునీటి కష్టాలను తీర్చాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం నీటిపారుదలశాఖ సీఈ రహీముద్దీన్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. అలంపూర్‌ నియోజకవర్గంలోని జూరాల లింక్‌ కెనాల్‌ ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న నెట్టెంపాడు 99వ ప్యాకేజీ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. 106వ ప్యాకేజీ చివరి ఆయకట్టు గ్రామాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఈకి సూచించినట్లు ఆయన తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీటిపై భరోసా కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

గద్వాలన్యూటౌన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం చేకూరుస్తున్న సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి.. పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని టీఎస్‌ సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలతో పాటు అనంతాపురం జెడ్పీహెచ్‌ఎస్‌లో చలో హైదరాబాద్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2004లో ప్రవేశపెట్టిన సీపీఎస్‌ విధానంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించడంలో సీపీఎస్‌ పూర్తిగా విఫలమైందన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 23న చేపట్టనున్న చలో హైదరాబాద్‌ కార్యక్రమంలో అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు మహిమూద్‌, రవిశంకర్‌, రమేశ్‌, షేక్షావళి, శిరీష, శ్రీకాంత్‌, యూనుస్‌ పాషా పాల్గొన్నారు.

‘శక్తి’ పాలసీలో

విలీనం సరికాదు

గద్వాలన్యూటౌన్‌: పాల్‌టెక్నిక్‌ను శక్తి పాలసీలో విలీనం చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని బీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్‌ పల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక పాల్‌టెక్నిక్‌ కళాశాల ఎదుట విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్కిల్‌ వర్సిటీలో పాల్‌టెక్నిక్‌ కళాశాలల విలీనానికి ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి పాలసీ విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు. ఈ పాలసీ వల్ల మూడేళ్లు వృథా అవుతుందన్నారు. ఇందుకోసం తీసుకొచ్చిన జీఓ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పీపీపీ మోడ్‌లో నిర్వహించడం అంటే ప్రైవేటీకరణ చేసే ప్రయత్నమన్నారు. ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న స్కిల్‌ వర్సిటీ పరిధిలోకి పోతే ఫీజులు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే విద్యార్థుల వ్యతిరేక విధానాలను మానుకోవాలన్నారు. కార్యక్రమంలో కిషోర్‌, భాను, ప్రణయ్‌, అఫ్రోజ్‌, రమేష్‌ పాల్గొన్నారు.

వేరుశనగ క్వింటా రూ.7,496

గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు బుధవారం 170 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,496, కనిష్టంగా రూ. 5,902, సరాసరి రూ. 6,389 ధరలు పలికాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement