ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేసి.. భక్తులకు మెరుగైన వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, భద్రత కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులకు సూచించారు. బుధవారం బీచుపల్లి అభయాంజనేయస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించగా.. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి పురేందర్ ఆలయ చరిత్రను వివరించారు. కాగా, ఆలయ ప్రాంగణంలో చెత్తాచెదారం ఉండటంపై కలెక్టర్ అసహనం వ్యక్తంచేశారు. అనంతరం కృష్ణా పుష్కరఘాట్‌ను పరిశీలించారు. కృష్ణానదిలోని నిజాం కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను పర్యాటక శాఖకు పంపడం జరిగిందని తెలిపారు. నదీ తీరంలో సేవలు అదిస్తున్న గజ ఈతగాళ్లకు లైఫ్ జాకెట్లు, టార్చిలైట్లు, రక్షణ తాళ్లు, రెస్క్యూ బోట్ వంటి పరికరాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అత్యవసరంలో వెంటనే స్పందించేలా సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం మండలంలోని కస్తుర్బాగాంధీ, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న వసతులను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ నరేశ్, కార్యదర్శి అరుణ ఉన్నారు.


