గద్వాల: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో పీజీ వైద్యవిద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ప్రియాంకను ఢీకొట్టడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, దోషులకు వెంటనే శిక్షపడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కమనీయం..
రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని మంగళవారం బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ముస్తాబుచేసి.. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణం జరిపారు. జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల వేడుకలను భక్తులు కనులారా తిలకించి భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. షాద్‌నగర్‌కు చెందిన గుండ్రాతి స్వామి, స్వరూప కుటుంబ సభ్యులు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి పాల్గొన్నారు.
పంచాయతీ
కార్యదర్శులకు నోటీసులు
గద్వాల: విఽధి నిర్వహణలో అలసత్వం వహించిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులకు డీపీఓ శ్రీకాంత్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మంగళవారం గద్వాల మండలం ఈడిగోనిపల్లి, ధరూరు మండలం ఎములోనిపల్లి గ్రామాల్లో డీపీఓ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అయితే ఇద్దరు కార్యదర్శులు విధులకు హాజరు కాలేదు. దీనిపై ఆరా తీసిన ఆయన.. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొట్టడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.


