గద్వాల: స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న వేడుకలకు సంబంధించి వేదిక, పారిశుద్ధ్యం, తాగునీరు, సీటింగ్ తదితర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి.. వేడుకలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా జాతీయ పతాకం గౌరవానికి భంగం వాటిల్లకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రశంసా పత్రాల ప్రదానం కోసం శాఖల వారీగా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగుల పేర్లతో కూడిన ప్రతిపాదనలను నిర్ణీత గడువులోగా పంపించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం 15వ తేదీన అర్హులైన వారందరికీ స్మార్ట్ రేషన్ కార్డులను ముఖ్యఅతిథి చేతుల మీదుగా అందజేయాలని నిర్ణయించినందున సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. కొత్తగా చేయూత పింఛన్లు కూడా అర్హులైన లబ్ధిదారులకు అందజేసేందుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పింఛన్ల కోసం ఇదివరకు దరఖాస్తు చేసుకున్న వారు ప్రస్తుతం కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 31వ తేదీలోగా అర్హులందరూ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అనదపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్‌రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు ఉన్నారు.
● కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు మంజుల, ఉదయ్‌కిరణ్, వెంకటేశ్వర్‌రెడ్డి, సురేశ్ ఉన్నారు.


