గద్వాల క్రైం: శాంతి భద్రతల విషయంలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ.. అనుమానాస్పద కేసులపై వేగంగా విచారణ జరపాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాల విక్రేతలపై నిఘా ఉంచి.. క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. యువత గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి రవాణా, విక్రయాలను కట్టడి చేయడంతో పాటు నిందితులను రిమాండ్‌కు తరలించడంలో సిబ్బంది కృషిని ఆయన అభినందించారు. ఎవరైనా చట్టవ్యతిరేక వ్యవహారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని.. ఇందులో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం క్షేత్రస్థాయిలో విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసులపై ప్రత్యేకంగా విచారణ చేపట్టాలని తెలిపారు. స్టేషనలో నమోదైన కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా, వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ శంకర్, సీఐలు శ్రీను, ప్రదీప్‌కుమార్, శంకర్‌గౌడ్ ఉన్నారు.


