పునరుద్ధరణ జరిగేనా?! | - | Sakshi
Sakshi News home page

పునరుద్ధరణ జరిగేనా?!

Aug 8 2026 12:35 AM | Updated on Aug 8 2026 12:35 AM

అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్‌ కేంద్రంలో జరిగిన ఘార ప్రమాద ఆనవాళ్లు నేటికీ చెదిరిపోవడం లేదు. శ్రీశైలం జలాశయానికి కృష్ణానది ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రారంభం కావడంతో నాలుగో యూనిట్‌ ప్రారంభానికి జెన్‌కో అధికారులు సిద్ధం చేశారు. వారం రోజుల్లో ట్రయల్‌ రన్‌ పూర్తి చేసి విద్యుదుత్పత్తి చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు జెన్‌కో అధికారులు గురువారం భూగర్భజల విద్యుత్‌ కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రమాదం జరిగిన ఆరేళ్ల తర్వాత అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తుండటం విశేషం.

షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా..

2020 ఆగస్టు 20న రాత్రి నాలుగో యూనిట్‌లో చోటు చేసుకున్న షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా రాష్ట్రానికి విద్యుత్‌ వెలుగులు ఇచ్చే భూగర్భ కేంద్రంలో చీకట్లు కమ్ముకున్నాయి. ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలు, పొగలతో ఉక్కిరిబిక్కిరికి గురై డ్యూటీలో ఉన్న తొమ్మిది మంది ఉద్యోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నాలుగో యూనిట్‌ ప్యానెల్‌ బోర్డులో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగడం, చుట్టూ మంటలు, పొగలో చిక్కుకుని ఏడుగురు జెన్‌కో ఉద్యోగులు, ఇద్దరు అమరాన్‌ బ్యాటరీ కంపెనీకి చెందిన ఉద్యోగులతో సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ప్రమాదం జరిగిన నాలుగో యూనిట్‌ను పునరుద్దరించే పనులు వివిధ కారణాలతో ఆలస్యమైనా.. ఎట్టకేలకు పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఎడమ గట్టు భూగర్భజల విద్యుత్‌ కేంద్రంలో యూనిట్లు 6

మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు

ఒక యూనిట్‌లో చేపట్టే విద్యుదుత్పత్తి 150 మెగావాట్లు

శ్రీశైలం ప్రాజెక్టు విద్యుదుత్పత్తి

కేంద్రం వివరాలిలా..

ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ 162.81టీఎంసీలు

ప్రస్తుతం ఐదు యూనిట్లలో చేపడుతున్నది

750 మెగావాట్లు

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం

215 టీఎంసీలు

ఇదే తొలి ప్రమాదం..

శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రాన్ని 2001 ఫిబ్రవరిలో ఒక యూనిట్‌ ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఈ కేంద్రంలో మొత్తం 6 యూనిట్లకు గాను ఒక్కో యూనిట్‌ 150 మెగావాట్ల చొప్పున మొత్తం 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. 2020 వరకు ఈ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి కొనసాగింది. 24 గంటల వ్యవధిలో 6 యూనిట్ల ద్వారా 21 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసేవారు. అయితే ఆరేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో నాలుగో యూనిట్‌ పూర్తిగా ధ్వంసం కాగా.. ఇప్పటి వరకు ఈ యూనిట్‌ పునరుద్ధరణ పూర్తికాలేదు. అయితే భూగర్భ కేంద్రం చరిత్రలోనే ఇదే తొలి ప్రమాదం కావడం గమనార్హం.

శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్‌ కేంద్రంలో సిద్ధం చేస్తున్న నాలుగో యూనిట్‌

వరదలు వస్తుండటంతో

వారంలో వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు

2020 ఆగస్టు 20 నాటి దుర్ఘటనలో 9 మంది ఉద్యోగుల మృతి

ఆరేళ్లుగా సా..గుతున్న మరమ్మతు పనులు

అందుబాటులోకి 150 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి

రూ.14.93 కోట్లతో మరమ్మతు

ప్రమాదం జరిగిన తర్వాత 2021లో నాలుగో యూనిట్‌ పనులు పునరుద్ధరించేందుకు మరమ్మతు చేపట్టిన అధికారులు ఇంతవరకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. పూర్తిగా ధ్వంసమైన నాలుగో యూనిట్‌ను రూ.14.93 కోట్లతో మరమ్మతు చేపట్టి.. 2023లో పూర్తి చేసినా.. సాంకేతిక సమస్యలతో 72 గంటలు పనిచేసి మళ్లీ ఆగిపోయింది. దీనిపై జెన్‌కో అధికారులు కమిటీ వేసి పొరపాట్లు, లోపాలను గుర్తించింది. కాంట్రాక్టు సంస్థ పొరపాట్ల వల్లే ప్రమాదం సంభవించిందని, డిజైన్‌లోనూ లోపాలున్నాయని కమిటీ తేల్చింది. తిరిగి అదే సంస్థ పనులు చేయాలని నిర్ణయించారు. రెండేళ్ల తర్వాత గతేడాది మాదిరిగానే మరోసారి మరమ్మతు చేపట్టగా.. మళ్లీ అదే తరహాలో 10 గంటలు పనిచేసి ఆగిపోయింది. అయితే రెండేళ్ల క్రితం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ కేంద్రాన్ని సందర్శించి నాలుగో యూనిట్‌ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని జెన్‌కో అధికారులను ఆదేశించారు. దీంతో ఈసారి కాంట్రాక్టు సంస్థ, జెన్‌కో ఇంజినీర్ల పర్యవేక్షణలో మరమ్మతు చేపట్టి.. ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement