ధరూరు: మండలంలోని పెద్దచింతరేవుల ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం నుంచి నిర్వహించనున్న చాతుర్మాస పూజల్లో పాల్గొనేందుకు పలువురు పీఠాధిపతులు శనివారం ఆలయానికి చేరుకున్నారు. ఉడిపి పలిమారు మఠంకు చెందిన 1008 శ్రీవిద్యాధీశ తీర్థశ్రీపాదులు, 1008 శ్రీవిద్యా రాజేశ్వరతీర్థ శ్రీపాదుల స్వాముల వారు ఆలయానికి చేరుకున్నట్లు ప్రధాన అర్చకులు ఆద్య కేశవాచార్యులు తెలిపారు. వచ్చేనెల 25 వరకు జరిగే ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
కుంటల నిర్మాణానికి రైతులను ప్రోత్సహించాలి
గద్వాల: వర్షాలు తక్కువగా కురుస్తున్నందున అందుబాటులో ఉన్న నీటి వనరులను నిల్వ చేసుకున్న రైతులు పంట కుంటలను నిర్మించునేలా ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిర్వహించిన వీసీలో పాల్గొన్న అనంతరం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ నీటి వనరుల వినియోగం, ఉన్న నీటిని వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి అవసరాలకు నిల్వచేసేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ఈ నెల 15వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్‌కార్డులు అందజేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సూచించారు.
హామీల అమలులో
కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
గద్వాల: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వెంకట్రాములు అన్నారు. శుక్రవారం బీజేపీ నాయకులు జిల్లాకేంద్రంలో ప్రభుత్వ ఎంఏఎల్‌డీ డిగ్రీ కళాశాలలో ఫీజు బకాయి– బీజేపీ లడాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజులు, స్కాలర్‌షిప్‌లు సకాలంలో విడుదల చేయకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


