గద్వాల: పట్టు, కాటన్ సమ్మిళతం చేస్తూ గద్వాల చేనేత జరీ చీరలను నేస్తుంటారని, భౌగోళిక గుర్తింపును పొందిన ఈ బ్రాండ్‌ను కాపాడుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత జౌళీశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇటీవల నూతనంగా ఎన్నికై న చేనేత సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, త్వరలోనే సంఘాల ప్రతినిధులు బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి కార్మికులకు రుణాలు ఇప్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రవేశపెట్టిన వివిధ పథకాలను అర్హులైన కార్మికులందరూ సద్వినియోగం చేసుకునేలా జియోట్యాగ్ నంబర్లను ఇప్పించడం జరుగుతుందన్నారు. భవిష్యత్ తరాలు కూడా చేనేత వృత్తిలో ఆర్థిక పురోగతి సాధించేలా గద్వాల చేనేత రంగాన్ని పటిష్టం చేసేందుకు కృషిచేస్తామన్నారు. అదేవిధంగా నేతన్నకు భరోసా, చేయూత, త్రిఫ్టు ఫండ్, బీమా తదితర పథకాలతో ప్రభుత్వం చేనేత కార్మికుల అభ్యున్నతికి సహకారం అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహకారాలను అందిపుచ్చుకుని కార్మికులు ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. ఇటీవల జిల్లాకు చెందిన చేనేత కార్మికుల రూ.41.23 కోట్ల రుణాలను మాఫీ చేశామన్నారు. ఇక్కడి మాస్టర్ వీవర్స్, సహకార సంఘాల ప్రతినిధులు చేనేత కార్మికుల పిల్లల చదువులకు, వైద్య అవసరాలకు సామాజిక బాధ్యతగా తమవంతుగా తోడ్పాటు అందించాలని సూచించారు. ప్రతిఒక్కరు గద్వాల చేనేత రంగాన్ని కాపాడుకునేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇటీవల నూతనంగా గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు చెందిన చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, సీనియర్ చేనేత కార్మికులను సన్మానించారు. అలాగే వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో ప్రతిభచాటిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. రూ.85 లక్షల విలువైన నేతన్న భద్రత చెక్కును కార్మికులకు అందించారు. అంతకు ముందు అంబేడ్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు చేనేత దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వాల్మీకి బోయ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, మున్సిపల్ చైర్‌పర్సన్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


