వీబీ–జీ రామ్ జీ ద్వారా నీటి సంరక్షణ పనులు
లక్ష్యం చేరుకుంటాం..
వీబీ–జీ రామ్ జీ కింద నీటి సంరక్షణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఇందుకు అనుగుణంగా సిబ్బందికి దిశానిర్దేశం చేశాం. ఆగస్టు నాటికి నీటి సంరక్షణ పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాం. పనులకు అవసరమైన ప్రతిపాదనలను అధికారులు, సిబ్బంది తయారు చేస్తున్నారు.
– ముషాహిదా బేగం, డీఆర్డీఓ
జిల్లాలో నీటి సంరక్షణ పనుల లక్ష్యాలు ఇలా..
ఫారం
పాండ్స్
1,144
వ్యక్తిగత ఇంకుడుగుంతలు
48,000
పెర్కోలేషన్
ట్యాంక్స్
240
సామూహిక ఇంకుడు
గుంతలు
240
గద్వాలన్యూటౌన్: ఈ ఏడాది ఎల్‌నినోతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్‌లో కూడా రావొచ్చు. వీటిని అధిగమించేందుకు నీటి సంరక్షణ ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వీబీ–జీ రామ్ జీ కింద నీటి సంరక్షణ పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో మండలాలు, గ్రామాల వారీగా లక్ష్యాలను నిర్దేశించింది.
వ్యవసాయంపై తీవ్ర ప్రభావం..
ఈసారి జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఫలితంగా భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. నీరు లేక జలాశయాలు వెలవెలబోతున్నాయి. ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. వ్యవసాయ అనుబంధ రంగాలపై సైతం ప్రభావం పడనుంది. జూన్‌లో విత్తనాలు వేసిన చోట మొలకలు రాలేదు. బోరుబావుల కింద సాగుచేసిన చోట నీటి లభ్యత తక్కువై మొక్కల ఎదుగుదల తగ్గింది. కొన్ని చోట్ల వేసిన పంటలను రైతులు తీసివేసి.. మళ్లీ దుక్కులు దున్నారు. ఇందుకు ప్రధాన కారణం వర్షాభావ పరిస్థితులేనని అంటున్నారు.
నీటి సంరక్షణపై దృష్టి..
ఎల్‌నినో లాంటివి భవిష్యత్‌లో మరెన్నో వచ్చే అవకాశం లేకపోలేదు. వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టిసారించింది. వీబీ–జీ రామ్ జీ కింద నీటి సంరక్షణ పనులను పెద్దఎత్తున చేపట్టాలని సంకల్పించింది. అన్ని గ్రామ పంచాయతీల్లో ఇంకుడు గుంతలు, ఫారం పాండ్స్ (నీటి కుంటలు). పెర్కోలేషన్ ట్యాంక్స్, బోర్ రీచార్జి, ఓపెన్ వెల్స్ నిర్మాణాలు చేపట్టేలా మూడు రోజల క్రితం అన్ని మండలాలు, గ్రామాల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు.
ఆరు రకాల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు
మండలాల వారీగా లక్ష్యాల నిర్దేశం
ఆగస్టు నాటికి పనులను పూర్తిచేసేలా చర్యలు
ఓపెన్
వెల్స్
రీచార్జి
20
బోర్‌వెల్
రీచార్జి
నిర్మాణాలు
240
ఇవీ ప్రయోజనాలు..
ఫారం పాండ్స్ పొలాల్లో ఏర్పాటు చేస్తారు. తద్వారా వర్షపు నీటిని నిల్వ చేసి.. వ్యవసాయ అవసరాలకు వినియోగించవచ్చు. వర్షాభావంలో నీటి కొరతను నివారిస్తుంది. పెర్కోలేషన్ ట్యాంక్‌లను గ్రామ పరిసరాల్లో నిర్మిస్తారు. దీనివల్ల భూగర్భజలాలు వృద్ధి చెందుతాయి. ఇళ్లల్లో వాడిన నీటిని, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి.. భూగర్భజలాలు పెంచేందుకు ఇంకుడు గుంతలు ఉపయోగపడతాయి. బోర్ వెల్ చుట్టూ గుంతల నిర్మాణంతో వర్షపు నీరు బోర్‌వెల్ లోపలికి వెళ్లి రీచార్జి చేస్తుంది. ఓపెన్‌వెల్ చుట్టూ నిర్మాణం చేయడం వల్ల భూగర్భజల మట్టాలు పెరుగుతాయి. ఇలా నీటి సంరక్షణ పనులతో సాగు, తాగునీటి కొరతను అధిగమించవచ్చు. కాగా, ప్రస్తుతం వర్షాలు లేనందున కూలీలకు వ్యవసాయ పనులు లేవు. నీటి సంరక్షణ పనులను చేపట్టడం ద్వారా కూలీలకు ఉపాధి లభిస్తుంది.


