ప్రాజెక్టుల సాధనకు సమష్టిగా కృషి | - | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల సాధనకు సమష్టిగా కృషి

Jul 20 2026 12:38 AM | Updated on Jul 20 2026 12:38 AM

అసంపూర్తి పనులు పూర్తిచేస్తే బీడు భూములు సస్యశ్యామలం

విస్తృత స్థాయి రౌండ్‌టేబుల్‌సమావేశంలో వక్తల పిలుపు

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల సాధన కోసం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఉమ్మడి జిల్లాలోని బీడు భూముల సాగునీటి సమస్యలు, పెండింగ్‌ ప్రాజెక్టులపై విస్తృత స్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. పదేళ్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రైతులను మోసం చేసిందని, ప్రాజెక్టులు పూర్తి చేయకుండానే పూర్తి చేసినట్లుగా హంగామా చేసిందన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేస్తే బీడు భూములను సస్యశ్యామలం చేయవచ్చన్నారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరు వలసల జిల్లా, వెనకబడిన ప్రాంతంగా ఉండేదని, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నివిధాలా అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కనీసం రూ.30 వేల కోట్లు కావాలన్నారు. నిజాలను నిర్భయంగా చెప్పాలని, నిజాయితీగా మాట్లాడితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించి ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని జేఏసీ నాయకులకు సూచించారు. కృష్ణానది నీటి వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలు కలిసి చర్చలు జరిపితేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ జిల్లా ప్రయోజనాల కోసం ఐక్యంగా పోరాటం చేద్దామని అన్నారు. జూరాల సామర్థ్యం 11 టీఎంసీలు ఉండగా ఇప్పుడు 6, 7 టీఎంసీల నీరు కూడా లేదని, పాలమూరు ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ముదిరాజ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బెక్కరి అనిత, ఆయా సంఘాలు, పార్టీల నాయకులు సాయిబాబా, షేక్‌ ఫరూఖ్‌ హుస్సేన్‌, బెక్కెం జనార్దన్‌, వీరబ్రహ్మచారి, జగపతిరావు, ప్రవీణ్‌కుమార్‌, రమేష్‌రెడ్డి, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement