గద్వాలవ్యవసాయం: వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. నానాటికీ బోరుబావుల్లో నీటిమట్టం తగ్గుముఖం పడుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వానాకాలంలో వ్యయ, ప్రయాసలకోర్చి సాగుచేసిన పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఓవైపు వర్షాలు కురువకపోవడం.. మరోవైపు ఎండల తీవ్రత కారణంగా రైతుల కళ్లెదుటే పంటలు ఎండుముఖం పడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. గంగమ్మ.. కనిపించమ్మా అంటూ వేడుకుంటున్నారు.
బోరుబావుల కింద సాగు..
నడిగడ్డలో కృష్ణా, తుంగభద్ర నదులున్నాయి. జూరాల జలాశయం, ఆర్డీఎస్, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలతో పాటు ఏడు రిజర్వాయర్లు, నోటిఫైడ్ చెరువుల సమీపాల్లోని బోరుబావుల్లో నీరు ఉండటంతో రైతులు వేలాది ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. ప్రధానంగా పత్తి, వేరుశనగ, వరి, కూరగాయలు, పండ్లతోటలు, ఆయిల్‌పామ్ తదితర పంటలు ఎక్కువగా సాగులో ఉంటాయి. వర్షాకాలంలో ఎప్పుడైనా అనుకున్న స్థాయిలో వర్షాలు రాకపోయినప్పటికీ.. కురిసే కొద్దిపాటి వర్షాలతో బోరుబావుల కింద సాగుచేసిన పంటలతో గట్టెక్కుతారు.
ఆందోళనలో అన్నదాతలు..
ఎప్పటిలాగే ఈసారి వానాకాలంలో రైతులు బోరుబావుల కింద పంటలు వేశారు. ఎక్కువగా పత్తి, వేరుశనగ, కూరగాయలను మే చివరి వారం నుంచే సాగుచేశారు. అయితే జూన్‌లో సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా నమోదైంది. ఈ నెలలో వర్షాల జాడే లేదు. జురాల జలాశయం నీరులేక వెలవెలబోతోంది. చెరువులు, కుంటలు జలకళను కోల్పోయాయి. వీటి ఫలితంగా భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోర్లలో ఐదు ఇంచులు నీరు వచ్చే చోట మూడు ఇంచులు.. మూడు ఇంచులు వచ్చే చోట ఒకటి, రెండు ఇంచులు మాత్రమే నీరు వస్తోంది. బావుల్లో సైతం నీటిమట్టం తగ్గుతోంది. రైతులు సాగుచేసిన పంటలకు నీరు సరిపోవడం లేదు. ఎక్కడికక్కడ మొక్కల ఎదుగుదల మందగించింది. దీనికి తోడు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు ఎక్కువయ్యాయి. దీంతో పలుచోట్ల పంటలు వాడుపడుతున్నాయి. ఒకరోజు విడిచి ఒకరోజు నీరందిస్తున్నా ఫలితం ఉండటం లేదు. కళ్లెదుటే పంటలు వాడుపడుతుండటంతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు. జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదంటూ ఆవేదన చెందుతున్నారు. భూగర్భజలమట్టం గణనీయంగా తగ్గుతుండంతో పండ్లతోటలు ఉన్న రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు కురవకపోతే బోర్లలో నీటిమట్టం పూర్తిగా తగ్గి.. పండ్లతోటలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాపోతున్నారు. ఇక బోరుబావులు ఉన్న పొలాలను కౌలుకు తీసుకొని సాగుచేసిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
మార్చి 5.06
ఏప్రిల్ 5.54
జిల్లాలో మార్చి నుంచి
భూగర్భజలమట్టం ఇలా (మీటర్లలో)..
మే 5.44
జూన్ 5.22
బోరుబావుల్లో నానాటికీ పడిపోతున్న నీటిమట్టం
సరిపడా నీరందక ఎండుతున్న పంటలు
సాగునీటి కోసం
అల్లాడుతున్న అన్నదాతలు


