విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపాలి
మల్దకల్: విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని జిల్లా ఉపాధి కల్పన అఽధికారిణి డా.ప్రయాంక అన్నారు. మంగళవారం మల్దకల్ మండలంలోని తాటికుంట, కుర్తిరావల్‌చెర్వు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరుశాతం, ఉపాధ్యాయుల పనితీరును తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యాబోధన చేసి.. వారి మేధాశక్తిని పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు గాను విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఆమె వెంట ఎంఈఓ సురేశ్ తదితరులు ఉన్నారు.


