కష్టాల్లో ఉన్నవారికి చేయూతనందించాలి
ఎర్రవల్లి: అన్య మతాలను గౌరవించడం, ఆదరించడం వంటి విలువలను బోధించిన మహానుబావుడు సత్యసాయి బాబా అని పదవ పటాలం కమాండెంట్ జయరాజు అన్నారు. ఆదివారం సత్యసాయి బాబా జయంతిని పురస్కరించుకొని బీచుపల్లి పదో బెటాలియన్‌లో కమాండెంట్ సిబ్బందితో కలిసి సత్యసాయి బాబా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయిబాబా తన భక్తి, ప్రార్థనలు, బోధనలతో ప్రజలను సన్మార్గం వైపు నడిపించారని కొనియాడారు. ఆపదలో ఉన్న ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, ఆహారం, నీటిని అందించి ఎంతో మందిని ఆదుకున్నారన్నారు. సంపాదించి దాచుకోవడమే తెలిసిన ఈ సమాజంలో తను మాత్రం భక్తి, ప్రార్థనలతో సంపాదించిన దాంట్లో కూడా దాచుకోకుండా నిరుపేదలకు సహాయం చేశారన్నారు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకొని ఈ రోజు అందరి హృదయాల్లో ఒక దైవ సమానమైన స్థానాన్ని సత్యసాయి బాబా పొందారన్నారు. ప్రతిఒక్కరూ సమాజ సేవ చేస్తూ తమకు చేతనైనంత సహాయాన్ని కష్టాల్లో ఉన్న వారికి అందించాలని కమాండెంట్ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్‌రెడ్డి, పాణి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


