మహిళల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యం
గద్వాలటౌన్/ధరూరు: మహిళల ఆర్థిక అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం గద్వాల మండలం గోనుపాడు, ధరూరు మండల కేంద్రంలోని రైతువేదికలో ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్నివిధాలా సహకారం అందిస్తోందన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా సంఘాలకు అందించే వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించాలని సూచించారు. వివిధ వృత్తులు, వ్యాపారాల్లో మహిళలు ప్రావీణ్యం పొందేందుకు గాను జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా మహిళా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తామన్నారు. ఒకప్పుడు మహిళలు బ్యాంకులకు వెళ్లాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి ఉండేదని.. ప్రస్తుతం బ్యాంకుల్లో ప్రధాన పాత్ర మహిళా సంఘాలదే ఉంటుందన్నారు. కొన్నేళ్లలోనే మహిళా సంఘాలు పెద్దఎత్తున ఏర్పాటై స్వయం సమృద్ధిని సాఽధిస్తున్నారని వివరించారు. జిల్లాలోని గట్టు, మల్దకల్, అలంపూర్ మండల్లాలోని సంఘాలు ఆర్టీసీకి బస్సులను అద్దెకు ఇచ్చేందుకు గాను ప్రభుత్వం రూ. 30లక్షల చొప్పున సబ్సిడీ మంజూరు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, మాజీ వైస్‌ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీఓ శైలజ, తహసీల్దార్ మల్లికార్జున్, డీపీఎం అరుణ, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, రామన్న, విజయ్‌రెడ్డి, ఉరుకుందు పాల్గొన్నారు.


