అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
అలంపూర్: నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం అడిషనల్ కలెక్టర్ నర్సింగ్‌రావుతో కలిసి ఆయన మహిళలకు ఇందిరా మహిళాశక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మేరకు అర్హులందరికీ ఆరు గ్యారంటీలను అందించాలన్నారు. ఇటీవల ఓ దివ్వాంగుడు, వృద్ధురాలు తమకు పింఛన్ రావడంలేదని తన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. అర్హులకు సంక్షేమ పథఽకాలు అందించడంలో నిర్లక్ష్యం చేయొద్దని అధికారులకు సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రెండు రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో 17 నుంచి 18 ఏళ్లలోపు కిషోర బాలికలతో పాటు వృద్ధులతో ప్రత్యేకంగా సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 311 గ్రామ సంఘాలు ఉన్నాయని వివరించారు. వాటి ఆధారంగా 311 వృద్ధుల సంఘాలు, 3,111 దివ్వాంగ, 662 కిషోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సంఘంలో ఉన్న ప్రతి మహిళకు రూ. 10 లక్షల బీమా సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. బ్యాంకు రుణాల్లో రూ. 2లక్షల వరకు మాఫీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాసులు, డీడబ్ల్యూఓ సునంద, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డెన్న, తహసీల్దార్ మంజుల, ఎంపీడీఓ పద్మావతి, ఏఓ నాగార్జున్ రెడ్డి, రాష్ట్ర టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడు ఎండీ ఇస్మాయిల్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ప్రభావతి, కార్యదర్శి సౌజన్య, డీపీఎం సలోని పాల్గొన్నారు.


