త్వరలోనే వలంటీర్ల నియామకం
గట్టు: గట్టు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా విద్యావలంటీర్లను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు డీఈఓ విజయలక్ష్మీ తెలిపారు. శుక్రవారం తుమ్మలచెరువు ప్రాథమికోన్నత పాఠశాలలో గట్టు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థిగా మారి, తరగతుల్లో విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునే విధంగా ఆధునిక పద్ధతులను ఉపయోగించి పాఠ్యాంశాలను బోధించాలన్నారు. గట్టు మండలంలో ఉపాధ్యాయులు వాడుతున్న బోధనా పరికరాలను చూసి ప్రశంశించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంటుందన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్ మిడ్‌లైన్ టెస్టులో విద్యార్థుల మెరుగైన ప్రగతికోసం మరింత కృషి చేయాలని సూచించారు. పాఠశాలలో భవిష్యత్‌భారత్ స్వచ్ఛంద సంస్థ నిర్మిస్తున్న వంటగది నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు.కార్యక్రమంలో ఏసీజీఈ శ్రీనివాస్, జిల్లా సమన్వయ అధికారి అంపయ్య, ఎంఈఓ వెంకటేశ్వర్లు, హెచ్‌ఎంలు నల్లారెడ్డి, రామన్‌గౌడ్, రాజన్న, బాలరాజు, నర్సింహులుగౌడ్ పాల్గొన్నారు.


